Breaking News

అన్ని సేవలకు ఒకే నంబర్​ 112

సారథి న్యూస్, రామాయంపేట: ఇక నుంచి క్రైం జరిగితే 100కు, రోడ్డు ప్రమాదానికి 108, అగ్నిప్రమాదం సంభవిస్తే 102కు కాల్​ చేయాల్సిన అవసరం లేదు. అన్ని సేవలకు 112 నంబర్​కు ఫోన్​చేస్తే సరిపోతుంది. పోలీసు, రెవెన్యూ, వైద్యం మొదలైన అన్నిశాఖలను సమన్వయం చేస్తూ కేంద్రప్రభుత్వం 112 అనే అత్యవసర సహాయనంబర్​ను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నెంబర్​ పనిచేయనున్నది. ఇకనుంచి దేశంలో ఎక్కడున్నా ఒకే నంబర్​కు ఫోన్​చేయవచ్చు. అన్ని రాష్ట్రాల కు చెందిన అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం తో పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా క్షణల్లో సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తారు.112 పై అవగాహన కల్పించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సెమ్మెస్, వాయిస్ కాల్,ఈ-మెయిల్ ,ఈ.ఆర్.ఆర్.ఎస్. వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వెంటనే సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటారు. యాపిల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లలో 112 యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లలో పవర్ బటన్ ను మూడు సార్లు నొక్కిపడితే, సాదారణ ఫోన్ లలో 5 లేదా 9 కీ ప్యాడ్ ను ఎక్కువ సేపు నొక్కి ఉంచడం ద్వారా కూడా అత్యవసర సేవల సిబ్బంది అందుబాటులోకి వస్తారు. జీపీఎస్​ పరిజ్ఞానం ద్వారా సమస్య జరిగిన ప్రాంతాన్ని గుర్తించి దగ్గర్లోని సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తారు.