Breaking News

అత్యాశే..‘పుట్టి’ ముంచింది

అత్యాశే..‘పుట్టి’ ముంచింది

  • తుంగభద్ర నదిలో యువకుడు గల్లంతు
  • అర్ధరాత్రి మద్యం తరలిస్తుండగా ఘటన
  • గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు

సారథి న్యూస్, మానవపాడు (జోగుళాంబ గద్వాల): రోజుకు రూ.ఐదారు వేలు వస్తున్నాయనే అత్యాశే ఓ యువకుడి కొంపముంచింది. చీకటిమాటుగా సాగిస్తున్న దందా ప్రాణం మీదకు తెచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తుంగభద్ర నదిలో ఆదివారం అర్ధరాత్రి పుట్టి ద్వారా నదిని దాటుతుండగా ప్రవాహంలో పుట్టి మునిగిపోయింది. ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగుచూసింది. గల్లంతైన ముగ్గురిలో ఇద్దరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. రవికుమార్(35) అనే యువకుడు నదిలో గల్లంతయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తుంగభద్రలో గాలిస్తున్న పోలీసులు, గజ ఈతగాళ్లు

ఏం జరిగిందంటే..
తుమ్మిళ్ల గ్రామానికి చెందిన అంజి, రాఘవేంద్ర ప్రతిరోజు మద్యం సరుకును దొంగచాటున తుంగభద్ర నది నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రవికుమార్ కు చెందిన పుట్టిలో 36 మద్యం కేసులను తీసుకుని అవతలి వైపునకు పుట్టిలో దాటుతున్నారు. ఉన్నట్టుండి మార్గమధ్యంలో పుట్టి నీటిలో మునిగిపోయింది. రవికుమార్ మాత్రం తుంగభద్ర నదిలో గల్లంతయ్యాడు. అంజి, రాఘవేంద్ర తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మద్యం అవతలి వైపునకు పుట్టిలో మద్యం తరలిస్తే రోజువారీగా రూ.ఐదు నుంచి రూ.ఏడువేలు వస్తాయనే ఆశతో రవికుమార్ రోజు మాదిరిగానే నదిలో పుట్టి వేశాడు. ఈ క్రమంలో ఆదివారం కూడా మద్యం తరలించాలని ఉద్దేశంతో పుట్టి నదిలో తీసుకుని వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. శాంతినగర్ సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలంలో అక్కడే ఉండి గాలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు.