Breaking News

అక్రమ మద్యంపై ఉక్కుపాదం

సారథి న్యూస్, అమరావతి: రాష్ట్రంలో అక్రమమద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఏపీ సీఎం వైఎస్​ జగన్మోహన్​రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుకను అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అమరావతి నుంచి మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రజలకు సకాలంలో సేవలందించేందుకు వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు. సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే వలంటీర్లపై కఠినచర్యలు తీసుకుంటామని.. వారికి అపరాధ రుసుము వేసే విషయంపై అధికారులతో చర్చిస్తున్నట్టు సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్ లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లు ఇసుక నిల్వలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కరోనాపై ప్రజల్లో భయం పోగొట్టాలని.. వ్యాధిపై వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నాడు-నేడు పనులు జూలై నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.