
షార్జా: సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన తడాఖా చూపించింది. ఐపీఎల్13లో భాగంగా షార్జా వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. సన్‌రైజర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకుంది. ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. తొలుత బౌలింగ్‌లో ఇరగదీసిన సన్‌రైజర్స్, బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(85 నాటౌట్; 58 బంతుల్లో 4×10, 6×1), సాహా(58నాటౌట్; 45 బంతుల్లో 4×7, 6×1) సాధించడంతో తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యం సాధించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జయకేతనం ఎగరవేసింది. సన్‌రైజర్స్ 17.1 ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా ఘన విజయం సాధించి, మూడో స్థానానికి చేరింది.
ముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పొలార్డ్(41; 25 బంతుల్లో 4×2, 6×4), డీకాక్(25; 13 బంతుల్లో 4×2, 6×2), సూర్యకుమార్( 36; 29 బంతుల్లో 4×5), ఇషాన్ కిషన్(33: 30 బంతుల్లో 4×1, 6×2) మాత్రమే ఆడగా మిగతావారు విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ మూడు వికెట్లు సాధించగా, నదీమ్, హోల్డర్ రెండు వికెట్ల చొప్పున తీశారు. రషీద్ ఖాన్‌కు వికెట్ దక్కింది.