Breaking News

ఆ స్ఫూర్తితోనే విలేకరి అయ్యా

  • గిరిజనుల స్థితిగతులపై రాసిన కథనాలు సీఎంనే కదిలించాయ్​
  • జర్నటిస్టులకు వృత్తిపట్ల శ్రద్ధ, పరిస్థితులపై క్షుణ్ణత ఉండాలి
  • మాతృభాష మన మన అస్తిత్వం.. మనమే బతికించుకోవాలి
  • సీనియర్​ పాత్రికేయులు పట్నాయకుని వెంకటేశ్వరరావు
  • సారథి ‘జర్నలిస్టు’తో ముఖాముఖి

అది 2001.. పదిరోజుల పాటు జోరువానలు.. భువనేశ్వర్‌లో భీకర పరిస్థితి, తాటిచెట్టు ఎత్తంత ప్రవహించే వరద.. ఒక్కసారి మా ప్రాణాలు పోయినంత పనైంది. అయినా కూడా సైన్యానికి చెందిన బోట్లలో వెళ్లి కథనాలు రూపొందించాం.’ అని సీనియర్​ జర్నలిస్ట్, కవి, రచయిత, వ్యాఖ్యాత పట్నాయకుని వెంకటేశ్వరరావు (వీఆర్) తన అనుభవాలను చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతంలో పనిచేసినా అక్కడి భాష, యాసతో పరిచయం ఏర్పడిందని చెబుతున్నారు. హృదయస్పందన, భాషాపటిమ, వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలని ఈ తరం జర్నలిస్టులకు సలహా ఇస్తున్నారు. భాష మన అస్తిత్వమని.. దాన్ని కాపాడుకోవాలని తెలుగు మాతృభాషా వికాసానికి విశేషంగా కృషిచేస్తున్నారు. ఫేస్​బుక్​వేదికగా ఆయన నిర్వహిస్తున్న ‘వారం వారం తెలుగుహారం’ విశేషంగా ప్రాచుర్యం పొందింది. ఆయన పాత్రికేయ వృత్తి.. జీవిత గమనాన్ని ‘సారథి జర్నలిస్ట్’తో ఇలా పంచుకున్నారు.

సారథి: మీ కుటుంబ నేపథ్యం చెప్పండి..
వీఆర్:
మాది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం, కాపుగోదేవలస అనే కుగ్రామం. మా తాత గారు కరణీకం చేసేవారు. ఆయన పేరే నాకు పెట్టారు. నాన్న ప్రసాదరావు ఖర్గపూర్‌ రైల్వే విభాగంలో స్టేషన్‌ సూపరింటెండెంట్ ​స్థాయివరకూ చేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన తెలుగు, ఇంగ్లిషు, బెంగాళీ, ఒరియా భాషలతో చక్కటి పరిచయం ఉంది. సాహిత్యాభిలాష ఉండేది. అమ్మ లలితేశ్వరి గృహిణి. నేను ఎంఏబీఎల్‌ చేశాను.

సారథి: జర్నలిజం వృత్తిలోకి ఎలా వచ్చారు. మిమ్మల్ని ప్రేరేపించి అంశాలేమి? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించలేదా?
వీఆర్​: నాకు జర్నలిజం పట్ల శ్రీకాకుళంలో ఉండగా ఆసక్తి కలిగింది. అప్పట్లో నల్లి ధర్మారావు, పత్తి నాగేశ్వరరావు వంటి వారు స్ఫూర్తిగా నిలిచారు. నేను సాయి ఐటీఐ అనే సంస్థకు డైరెక్టర్​గా ఉంటూనే తొలుత ఆసక్తి కొద్దీ ఆంధ్రప్రభ స్థానిక విలేకరిగా చేరాను. అంతకుముందు కొన్ని స్థానిక పత్రికలకు వార్తలు రాసేవాడిని. ఇలా 1986 నుంచి 1992 వరకూ స్థానిక విలేకరిగా చేస్తూనే.. గ్రూప్‌1, 2 పరీక్షలకు సన్నద్ధమయ్యేవాడిని. ఇక దొరికిన పుస్తకాలు.. రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచనలు, తెన్నేటి సూరి, చంఘీజ్‌ ఖాన్, పానుగంటి వారి వ్యాసాలు, యండమూరి రచనలు, చలం సాహిత్యం, ఇలా అన్నీ చదవడం ఓ అలవాటు చేసుకున్నా. ఈ నేపథ్యంలోనే ‘ఈనాడు జర్నలిజం’ స్కూలు కోసం దరఖాస్తు ప్రకటన వస్తే దరఖాస్తు చేసుకున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో అప్పట్లో ఏడువేల మంది వరకూ ఈ పరీక్ష రాస్తే ఇంటర్వ్యూలో నెగ్గి శిక్షణకు 27 మంది దాకా ఎంపికయ్యాం. ఈనాడు చైర్మన్‌ రామోజీరావు, అప్పటి జర్నలిజం స్కూలు ప్రిన్సిపల్‌ బూదరాజు, అప్పటి న్యూస్‌టుడే ఎండీ రమేశ్‌బాబు ఇంటర్వ్యూలో కృతార్థులం కావడం గొప్ప అనుభూతి.

సారథి: మీరు వృత్తిలోకి ప్రవేశించిన తొలినాళ్లలో పాత్రికేయ వృత్తి ఎలా ఉంది.. వార్తల సేకరణ తపన, శ్రమ ఎలా ఉండేది?
వీఆర్:
అప్పట్లో నేను ఒక్కోసారి నేను వార్తలు తీసుకుని విజయనగరంలో ఉండే ఆంధ్రప్రభ యూనిట్‌ ఆఫీసుకు వెళ్లేవాడిని.. అక్కడి సబ్‌ ఎడిటర్లు అంతా సాహితీ దిగ్గజాలు, డాక్టరేట్లు చేసిన వారే. వారి మాట తీరు, పాండిత్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసేది. ఇక విలేకరిగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, జడ్జి వంటి వారితో సమానంగా వ్యవహరించే వాళ్లం. వారిని అడిగేటప్పుడు ఎలాంటి అంశమైనా మోహమాటం లేకుండా ప్రశ్నించే వాళ్లం. తెలియని అంశాలు ఉంటే వేరేగా వెళ్లి వివరణలు అర్థమయ్యేలా తీసుకునే వాళ్లం. ఇక మంత్రులు కనుమూరి బాపిరాజు, పి.జనార్ధనరెడ్డి వంటి వారితో వ్యక్తిగత పరిచయాలు ఉండేవి. ఎమ్మెల్యేలతో చనువుగా ఉంటూనే సమాచారం రాబట్టే వాళ్లం. ఇక అన్నిపక్షాల వారు ఆదరించేవారు. మేము కొంతవరకూ కొన్ని సమాచారాల కోసం వామపక్షాలు, ఆయా అనుబంధ సంస్థల సాయంతో పరిశోధనాత్మక అంశాలపై కథనాలను రాసేవాళ్లం. కొన్నిసార్లు వారు రక్షణ కవచంగా కూడా పనిచేసేవారు.

సారథి: మీరు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో పనిచేశారు కదా.. ఆయా ప్రాంతాల్లో మీ వృత్తి అనుభవాలు ఏమిటి?
వీఆర్:
అవును.. నాకు అన్ని ప్రాంతాలతో పనిచేసిన అనుభవం ఉంది. ‘ఈనాడు’లో ప్రతీ మూడేళ్లకూ జరిగే బదిలీలను ఆస్వాదించేవాళ్లం. కుటుంబాలతో కలిసే ఆయా ప్రాంతాల్లో ఉండేవాళ్లం. ఇలా నాకు ఈనాడులో విశాఖపట్నం, ఒడిశా, శ్రీకాకుళం, గుంటూరు, తాడేపల్లిగూడెం, కడప ప్రాంతాలతో పరిచయం ఏర్పడింది. ఇక కడపలో నాలుగేళ్లు ఉన్నాం. అందుకే నాకు ఎంతో కడపతో ఎంతో అనుబంధం. అక్కడి మాండలికాల పరిచయం ఏర్పడింది. ఇక ‘సాక్షి’ దినపత్రికలో కూడా నేను మళ్లీ కడప, కర్నూలు ప్రాంతాల్లో ఎడిషన్‌ ఇన్‌చార్జ్​గా పనిచేశాను. ఈ పరంపరంలో భాగంగా మహబూబ్‌ నగర్‌లో కూడా ఎడిషన్‌ ఇన్‌చార్జ్​గా చేశాను. ప్రస్తుతం ‘సాక్షి’ సెంట్రల్‌ డెస్క్​లో కొనసాగుతున్నాను. ఇలా నాకు కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల మాండలికాలు, భాషా వ్యత్యాసాలు, సాహిత్యం ఆయా ప్రాంతాల ప్రముఖులతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి.

సారథి: శ్రీకాకుళం జిల్లాలో నక్సల్స్‌ ప్రాబల్యం తీవ్రంగా ఉన్న ఆ కాలంలో వార్తల విషయంలో అటు పోలీసులు, ఇటు నక్సలైట్ల నుంచి ఒత్తిడి ఏమైనా ఉండేదా? ఎన్​కౌంటర్ల సమయంలో ఎలా స్పందించేవారు.
వీఆర్:
నేను పత్రికా రంగంలోకి వచ్చే సరికి నక్సల్స్​ప్రాబల్యం బాగా తగ్గింది. అదంతా 1960,1970 దశకాల్లోని స్థితిగతులు. అయితే ఆ తర్వాత కూడా కొండబారిడి దళం సీతంపేట ప్రాంతం, మందస, రట్టిజగ్గాపురం, పలాస, సోంపేట ప్రాంతాల్లో కొన్ని దళాలు ఉన్నా వారు పరిమితంగా పనిచేసేవారు. ఓసారి చేగొండి హరిరామ జోగయ్య మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో పర్యటించిన సమయంలో పలాస దాటాక బొడ్డపాడు అనే ప్రాంతంలో కొందరు నక్సల్స్‌ సానుభూతిపరులు వచ్చి నినాదాలు ఇవ్వడం, ఆయనను నిలదీయడం, ఆయన ఎంతో చాకచక్యంగా వారికి నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దడం అనే సంఘటనకు విలేకరిగా నేను సాక్షినే. అప్పుడు ఎస్పీ సింగ్‌ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్​గా ఉండేవారు. అప్పట్లో దళాలన్నీ యూజీలో ఉండేవి. కొరియర్ల ద్వారా మాకు వార్తలు పంపేవారు. ఇబ్బందికర సంఘటనలు ఎప్పుడూ ఎదురుకాలేదు.

సారథి: ప్రస్తుతం పత్రికారంగం, పాత్రికేయుల పరిస్థితి ఎట్ల ఉంది.. నిజాయితీ, నిబద్ధత కనుమరుగువుతోందనే ఆరోపణలు ఉన్నాయి కారణాలు ఏమై ఉండొచ్చు.?
వీఆర్:
ఇప్పుడు పాత్రికేయులకు ఆధునిక పరికరాలు, సాధనాలు వినియోగంలోకి వచ్చాయి. చాలా పరిస్థితులు, వసతులు మెరుగు పడ్డాయి. ఇక నిజాయతీ, నిబద్ధత అనేది ఆయా సంస్థలు తీర్చిదిద్దడం బట్టీ ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత శీలత ఉండేవారు అప్పుడూ ఇప్పుడూ ఉన్నారు. జేబులో కార్డు పెట్టి.. నీకింత.. నాకింత అనే పత్రికలు పుట్టుకొచ్చాక ఒక్క జర్నలిస్టునే నిందించడం తప్పు. దీనిపై చర్చ విస్తృతాంశం.

సారథి: వృత్తిపరంగా మీకు మంచి పేరు తెచ్చిన వార్తలు, రచనలు ఏమైనా ఉన్నాయి..?
వీఆర్​:
చాలా ఉన్నాయి. నేను ‘ఈనాడు’లో ఒడిశా ఎడిషన్‌ చూసేప్పుడు.. ఒడిశాలోన్ని అతిపెద్ద సంఘటన అది. వరదల కవరేజీకి ఓ బృందాన్ని తీసుకెళ్లాను. పదిరోజుల పాటు(2001) భువనేశ్వర్‌లో ఉండి జోరువాన, తాటిచెట్టు ఎత్తున ప్రవహించే నీటిలో సైన్యానికి చెందిన బోట్లలో వెళ్లి కథనాలు రూపొందించి ఇచ్చాం. ఓ సారి మా ప్రాణాల మీదకే వచ్చినా తెగించి ఆ రోజు వార్తలు ఇచ్చిన అంశం ‘ఈనాడు’ ఎండీ ప్రత్యేక అభినందనలకు నోచుకుంది. అలాగే ఒడిశాలోనే ఏటా జరిగే ఆకలి చావుల కథనాల కోసం రాయగడలో ఉండి ఏడు రోజులు కొండల్లోకి వెళ్లి గిరిజనుల స్థితిగతులపై కథనాలు చేశాం. ఇది సీఎం నవీన్‌ పట్నాయక్‌ను కదిలించి వారిని ఆదుకునేలా చేసింది. నేను అప్పటికి డెస్క్​లో ఉన్నా.. ఒరియా వచ్చు కాబట్టి ఈ కవరేజీలు చేసే అవకాశం యాజమాన్యం నాకు ఇచ్చింది. ఎంతో అనుభవాన్ని, ఆర్జించి పెట్టింది.

సారథి: మీ మొత్తం కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే వార్తలు, ఘటన, సందర్భం ఏదైనా ఉన్నదా?
వీఆర్:
చాలా ఉన్నాయి. కడపలో పనిచేస్తున్న సమయంలో అక్కడి కరువు పరిస్థితిపై సెంటర్‌స్ప్రెడ్‌ కథనాలు చేసి పేరు తెచ్చుకున్నాం. అలాగే కర్నూలులో రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలపై ‘సాక్షి’ ఎడిషన్‌ ఇన్‌చార్జ్​గా చక్కని కవరేజీ విభిన్న కోణాల్లో ఇచ్చాం. ఓ గాడిదను కథా వస్తువుగా చేసుకుని ‘గుండెచప్పుళ్లు’ పేరిట హైదరాబాద్‌ సిటీ, కర్నూలు, మహబూబ్‌ నగర్‌లో ఇచ్చాం. అలాగే మహబూబ్‌ నగర్‌లో జాతీయస్థాయి క్రీడలకు అద్భుత ప్రణాళికతో డెస్క్‌ మిత్రులు వెంకట్, హరిప్రసాద్​భాగస్వామ్యంతో ఇచ్చాం. ఇవన్నీ మరిచిపోలేని అనుభూతులే.

సారథి: మీ వృత్తి అనుభవంలో చాలా మంది కలెక్టర్లు, ఎస్పీలు, ప్రముఖ రాజకీయ నాయకులను కూడా కలిసుంటారు.. ఇంటర్వ్యూలూ చేసి ఉంటారు.. పాలనపై ఎవరు ఎలా స్పందించేవారు.. పాత్రికేయులతో ఎవరు ఎలా మెలిగేవారు.?
వీఆర్:
ఒక్కో అధికారిది, మంత్రిదీ ఒక్కో తీరు.. నాకు తెలిసి పీజేఆర్‌ చాలా చక్కగా స్పందించేవారు. అలాగే ఆర్పీ సిసోడియా, ఎస్పీ సింగ్, ఎస్పీ పూర్ణచంద్రరావు, మల్లిఖార్జున రావు, చెల్లప్ప, నీలంసాహ్ని అప్పటిలో సబ్‌ కలెక్టర్, వంటి వారు బాగా స్పందించే వారు. వీరిలో కొందరు వ్యక్తిగతంగా తమ బంగళాకు పిలుపించుకుని జిల్లా పరిస్థితులను అడిగి తెలుసుకునేవారు. వాస్తవాలు అని భావిస్తే వాటిపై ముందు కథనాలు రాయమని చెప్పి వెంటనే వారు స్పందించేవారు. ఏదైనా విలేకరి వ్యక్తిగత ఆసక్తి, వృత్తి పట్ల శ్రద్ధ, పరిస్థితులపై క్షుణ్ణత ఉంటే అధికారులైనా, నేతలైనా మనల్ని ఆదరిస్తారు. మనం వారినుంచి ఏదైనా ఆశిస్తే.. మాత్రం పక్కన బెడతారు.. పట్టించుకోరు. ఇది విలేకరి తత్వం, అతని వ్యక్తిగత పరిచయాలు, సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. అధికారుల్లో కూడా జిల్లాకు ఏదో చేయాలనే తపన ఉన్నవారైతే వారి వంతు ప్రయత్నంగా మనల్ని ఆశ్రయిస్తారు.

సారథి: ఇటు తెలంగాణ ఉద్యమం.. అటు సమైక్యాంధ్ర పోరు నడిచిన సమయంలో ఓ జర్నలిస్టుగా వార్తల విషయంలో మీరు ఎలా స్పందించేవారు?
వీఆర్:
అవును.. నేను తెలంగాణ ఉద్యమం పరాకాష్టలో ఉన్నప్పుడు ‘సాక్షి’ హైదరాబాద్‌ సిటీ డెస్క్‌ ఇన్‌చార్జ్​గా ఉన్నాను. అప్పుడు ఉద్యమాన్ని చాలా దగ్గరగా చూశాను. ఈ వార్తల డీలింగ్‌ పేజీలకు కేటాయింపు బాధ్యతలు నావే. దీనికోసం రోజూ చక్కని ప్రణాళికతో ప్రజాగొంతుక వినిపిస్తున్న వర్గాల వారి కథనాలు ఇచ్చేవాళ్లు. వార్తల నిర్ణయం చక్కగా ఉండేది. ఇక సమైక్య ఉద్యమ సమయంలోనూ నేను కర్నూలులో ఎడిషన్‌ బాధ్యతలు చూస్తున్నా.. అప్పుడూ అక్కడి వార్తలకు ప్రాధాన్యం ఇచ్చి పత్రిక బాధ్యతలను చక్కగా నిర్వహించాం. సరిగ్గా తెలంగాణ పోరు తుదిఘట్టానికి వచ్చేటప్పుడు తెలంగాణ ఆవిర్భావ సమయంలో మహబూబ్‌ నగర్‌లో ఉన్నాను. ఆ రోజు అన్ని తెలంగాణ జిల్లాల కంటే భిన్నంగా, మెరుగ్గా, ఓ చక్కని కవితతో జిల్లా మొదటి పేజీని ఇచ్చాం. ఇది జర్నలిస్టు ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తేనే సాధ్యమవుతుంది. నాకు ఈ విషయంలో సీపీ బ్రౌన్, సర్‌ అర్థర్‌ కాటన్‌ వంటి వారు ఆదర్శం.

సారథి: మీకు మాండలికాలు, భాస, యాస, పాండిత్యంపై బాగా పట్టుందని మీ రచనల్లో చదివాం, ఇదంతా ఎలా పట్టు సంపాదించారు.?
వీఆర్:
చెప్పానుగా వివిధ ప్రాంతాల్లో పనిచేయడం, అక్కడి ప్రజలు, భాష పట్ల ఆసక్తి.. నేను ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఆటోల్లో వెళ్లేటప్పుడు అందులో ఉన్న వారి మాటలు, మాండలికాలు పట్టుకునే ప్రయత్నం చేస్తాను. సందర్భం వచ్చినప్పుడు వాటిని ప్రయోగిస్తాను. ఇప్పుడు నేను రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ, కోస్తా మాండలికాల్లో రాయగలను. ఇది అనుభవం.. ఆసక్తి ద్వారా వచ్చిందే. ఆయా మాండలికాల్లో వచ్చే సాహిత్యాన్ని కూడా చదువుతాను. నాకు ఇలా కాలువ మల్లయ్య గారి సాహిత్యం ఎంతగానో ప్రభావితం చేసింది.

సారథి: మాతృభాషా పరిరక్షణకు మీరు పడుతున్న తపన అమోఘం. ఇంగ్లిష్ పై వ్యామోహం పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు భాషా చదువులకు భవిష్యత్​ ఉంటుందా?
వీఆర్​: తెలుగుకు చక్కని భవిష్యత్​ఉంది. ఇప్పుడు విదేశాల్లో ఉన్నవారు కూడా దీనికోసం పరితపిస్తున్నారు. అయితే మన ఇళ్లల్లో మార్పురావాలి. తల్లిదండ్రులు తమ ఇళ్లను తెలుగుకు పునాదిగా చేసుకోవాల్సిన తక్షణ అవసరం ఉంది. ఎవరి భాషలకు వారు పెద్దపీట వేసుకుంటే మనం విస్మరించి కొత్త తరం వారిని మాతృభాషకు దూరం చేస్తున్నాం. భాష అనేది మన అస్తిత్వం. ఇక తెలుగుభాషా చదువులు అనేది వేరేగా ఉండదు. ప్రాథమిక విద్యలో పునాదిగా రెండు మాధ్యమాలు ఉండాలి. ఆ తర్వాత ప్రాథమికోన్నత స్థాయినుంచి ఆంగ్లమాధ్యమానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. అసలు తెలుగునే వేరు చేయడం.. దానికి వేరేవి ఆపాదించుకోవడం సరికాదు. ఇది అందరి భాష. అలాగని ఆంగ్లం రావాలన్నా మనకు మాతృభాష పునాది మీదే సాధ్యం. ఏదో వచ్చీ రాని ఇంగ్లిషు మాట్లాడితే ఉద్యోగాలు రావు. ఇదే నిజమైతే ఈ రోజు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో విద్య పూర్తయిన వారందరికీ ఉద్యోగాలు రావాలి. కానీ నాలుగు శాతం మందికి వస్తే గొప్ప. అంటే భాష.. ఒక సాధనం వ్యక్తీకరణ, స్వయం ప్రతిభ చాలా ముఖ్యం. అలాగంటే ఒకప్పుడు తెలుగులో చదివిన ఎందరో ఉన్నతిస్థితికి వెళ్లారు. అంటే మన పునాది, సంస్కతి మీద నడిచే చదువు ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే ఆంగ్లమైనా, మరేదైనా ఒంటపడుతుంది. ఈ రోజు జర్మన్లు, జపనీయులు, చైనా వారు వారు మాతృభాషకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. వారు సాంకేతికంగా మనకంటే ఎంతో ఎత్తులో ఉన్నారు. ఇది మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోం. మనకు ఆంగ్లేయుడు మెకాలే రుద్దిన భావజాలం నుంచి బయటకు వస్తే మన మాతృభాష ఘనత తెలుస్తుంది. అమెజాన్, గూగుల్‌ వంటి సంస్థలు తెలుగు నిష్ణాతులకోసం జల్లెడ పడుతున్నాయి. అలాగని ఆంగ్లం వద్దని కాదు.. అదీ ఓ భాషగా కావాలి. ఉద్యోగాలు రావాలి. అంతేగాని తెలుగుకు తిలోదకాలిమ్మని కాదు. ఇది ఒక వర్గం సొంతం కాదు. అమ్మ భాష. అందరి అమ్మలూ ఒక్కటేగా.

సారథి: ‘వారం వారం తెలుగు హారం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది.. మీకు స్ఫూర్తి ఎవరు? ఇప్పటిదాకా ఎంతవరకు చేరింది?
వీఆర్​:
ఇది జర్నలిస్టుగా అక్షరాన్ని నమ్ముకుని అన్నంతింటున్న నా బాధ్యతగా భావిస్తున్నాను. నేను భాషా పండితుడిని కాదు. ప్రేరకుడిని మాత్రమే. కొత్తతరం పిల్లలు అటూ ఆంగ్లంలో నిష్ణాతులు కాక, తెలుగుదనం విస్మరించి డోలాయమాన స్థితిలో ఉంటే వారిలో కొంతలో కొంతైనా మార్పు తేవాలనే ఆశతో ‘వారం వారం తెలుగు హారం’ ఆలోచన వచ్చింది. దీనికి పలువురు మిత్రుల సలహాలు తీసుకుని ప్రింట్‌ మీడియాకు చెందిన నేను ఎలక్ట్రానిక్‌ మీడియాలో కూడా కొంచెం పరిచయం పెంచుకోవాలనే పట్టుదల ఇందుకు ప్రేరణ. అంతకు ముందు నేను 5వ ప్రపంచ తెలుగు మహాసందర్భంలో ఫేస్‌బుక్‌ వేదికగా ఆ కార్యక్రమాలను అక్కడకు వెళ్లి ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా లైవ్‌ ఇస్తుంటే చూసిన మిత్రులు ప్రోత్సహించారు. ఈ సందర్భంలో ఎందరో తెలుగు ప్రముఖులను కలుసుకున్నాను. ఇది సీఎం కేసీఆర్‌ తెలుగుకు తెచ్చిన పెద్ద ఊపుగా చెప్పాలి. అదే నాకు స్ఫూర్తి నింపింది. నాలోని కోరికను బలపడేలా చేసింది.

సారథి: ‘వారం వారం తెలుగుహారం’ కార్యక్రమాన్ని స్పందన ఎలా ఉంది..? ఇటీవల భాషాభిమానుల చేత ప్రశంసలు కూడా అందుకున్నారు కదా.. ఎలా ఫీలవుతున్నారు?
వీఆర్​: అవును.. ఇప్పుడు 111వ వారం నడుస్తోంది. వంద వారాలు అంటే ప్రతీ ఆదివారం ఇంటిలోని ఓ గదిని తాత్కాలిక స్టుడియోగా మార్చి ప్రత్యక్ష ప్రసారం క్రమం తప్పకుండా నిర్వహించాను. ఉదయం సరిగ్గా నా ఫేస్‌ బుక్‌ వాల్‌పై ప్రారంభయ్యే ఈ కార్యక్రమంలో నేను తెలుగు పద్యం, సామెతలు, నుడికారాలు, సంఘటనలు, విశేషాలు.. తాజా అంశాలు ఓ అర్థగంట చెప్పాక .. అతిథులతో ముఖాముఖి ఉంటుంది. ఆరుద్ర శిష్యుడు సన్నిధానం నరసింహశర్మ, డాక్టర్​ కాలువ మల్లయ్య, డాక్టర్​త్రిమూర్తుల గౌరీశంకర్, రిటైర్ట్​ఐఏఎస్‌ అధికారి ప్రభాకర రెడ్డి, ప్రముఖ కథకులు, రాంకీ ఫౌండేషన్‌ సీఎస్‌ఆర్‌ హెడ్‌ ఎంవీ రామిరెడ్డి, సినీరచయిత ఇందు రమణ, బేస్‌ నిర్వాహకుడు, సైకాలిజిస్టు లక్ష్మణ్, వంటి ప్రముఖులు 65 మంది మన ఇంటికి వచ్చి పాల్గొన్నారు. మారిషస్‌ దేశ విద్యాధికారి సంజీవ నరసింహ అప్పడు కూడా పాల్గొనడం విశేషం. మరో 30 మంది ఫోన్‌ ద్వారా ముచ్చటించారు. కొన్ని ఎపిసోడ్లు మొత్తం నేనే నడిపించాల్సి వచ్చింది. ఇలా వందవారాలు పూర్తి చేసుకున్నాక మార్చి 1న 100వ వారం వేడుక హైదరాబాద్​ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించాం. దీనికి ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ విశేష అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇంకా పలువురు సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నేను యూట్యూబ్‌లో ‘వీఆర్‌ తెలుగు టీవీ’ పేరిట వీడియోలుగా సంక్షిప్తీకరించి పెడుతున్నాను. మంచి ఆదరణ ఉంది. మన దేశంలోని వారితో పాటు మలేసియా, మస్కట్, మారిషస్, మయాన్మార్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా దేశాల్లోని తెలుగు వారు చూస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి నాకు సహకరించేది నా శ్రీమతి ఇందిర, మా అమ్మాయి శివప్రత్యూషలు. దీనికి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. వారం వారం తెలుగు హారం వల్ల ఎందరో ప్రముఖులు పరిచయమయ్యారు. దీనివల్లే మన దేశ ఉపరాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం చిక్కింది. ఇవన్నీ నాకు నిరంతరం చైతన్యపరిచేవే.

సారథి: తెలుగు మాతృభాషా వికాసానికి ఇంకా ఏంచేయాలి.. ప్రభుత్వాలకు మీరిచ్చే సలహాలు?
వీఆర్:
ఇల్లు పునాదిగా కుటుంబాలు భాషా ప్రేమను చాటి ఆచరణలోకి తేవాలి. తద్వారా పిల్లలకు భాష మీద మమకారం పుడుతుంది. ఇక ప్రభుత్వాలు దీన్ని గుర్తెరిగి భాషా పండితులను ప్రోత్సహించాలి. తెలుగు ప్రత్యేక అంశాలుగా చేర్చి ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ ఇవ్వాలి. అనువాదాలు, నిఘంటువులు మరిన్ని రావాలి. దీనికి మనమంతా చేతులు కలిపి పనిచేయాలి. తెలుగు వద్దను కోవడం మాత్రం దారుణమనే చెప్పాలి.

సారథి: డిజిటల్, సోషల్​మీడియా విస్తృతమవుతున్న నేపథ్యంలో పత్రికా వ్యవస్థకు కాలం చెల్లినట్లేనని చాలా మంది భావిస్తున్నారు.. ఈ పరిస్థితిని ఎలా చూడవచ్చు.?
వీఆర్: ఏమీ ఉండదు.. పత్రిక పత్రికే.. డిజిటల్‌ మాధ్యమాల పాత్ర ఎలా ఉన్నా ఒక దాన్ని పట్టి చదవడం అనే గుణం మనలోని లక్షణం. పత్రికలకు ఇప్పుడు కరోనా వల్ల తాత్కాలిక ఇబ్బందులు ఉండవచ్చేమో గాని వాటికి మనుగడే ఉండదనే ఆలోచన తప్పు. ఏదేమైనా చదువరులను పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదీ. కుటుంబాలది.

సారథి: వృత్తిని ఎంచుకున్నందుకు ఏనాడైనా అసంతృప్తి కలిగిందా.. ఈ తరం జర్నలిస్టుల్లో చాలా మంది ‘ ఈ ఫీల్డ్​లోకి ఎందుకొచ్చాంరా.. బాబు!’ అనుకుంటున్నారు.. దీనికి కారణం ఏమిటి?
వీఆర్​: లేదు.. ఒక్కోసారి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అనిపించినా తాత్కాలికమే. ఈ వృత్తిలో మేము మంచి రోజులనే చూశాం కాబట్టి నాకైతే అలా అనిపించదు. మేము సాహిత్యం నేపథ్యంతో ఇందులోకి అడుగుపెట్టాం. అదీ ఎంతో ఊరటనిచ్చేది. ఇక కొత్తవారు దీన్ని ఉద్యోగం అనుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. మనది న్యాయవాద, వైద్య, వృత్తుల్లాగా భావిస్తే.. దీని విలువ, అవసరం, పాత్ర చాలాపెద్దది.

సారథి: ఈ తరం పాత్రికేయులకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏమిటి? ఈ వృత్తిలో కొనసాగాలంటే ఎలా నడుచుకోవాలి.. మీ సందేశం?
వీఆర్​: వ్యక్తిగతంగా అధ్యయనం.. సహనం, క్రమశిక్షణ, గౌరవించే స్వభావం.. మనకు తెల్సింది తక్కువ.. నేర్చుకోవాల్సింది ఎక్కువ అనే అంశాలు జీర్ణించుకోవాలి. ప్రవర్తనాశైలి మారాలి. ఎదుటి వారితో ఎలా వ్యవహరించాలి, ఎక్కడి తగ్గాలి.. ఎక్కడ ముందుకెళ్లాలనే అవగాహన చాలాముఖ్యం. నిరంతరం సమకాలీన అంశాల అధ్యయనం, సునిశిత పరిశీలన, ముఖ్యంగా న్యూస్‌నోట్, అన్నింటికీ మించి హృదయ స్పందన, భాషాపటిమ, వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. ఇది అనుభవంతో చెప్పినవే తప్పా.. ఇంకా సందేశాలిచ్చే అంతస్థాయి నాకు రాలేదు.

:: శ్రీ.శ్రీ

One thought on “ఆ స్ఫూర్తితోనే విలేకరి అయ్యా”

  1. మీ కృషి పట్టుదల ఉండబట్టే మీరు ఈ స్థాయికి ఎదిగారు

Comments are closed.