Breaking News

పీవీ.. వందేళ్ల జ్ఞాపకాలు

పీవీ.. వందేళ్ల జ్ఞాపకాలు

సారథి న్యూస్, హైదరాబాద్: ‘ఢిల్లీకి రాజునైనా తల్లికి బిడ్డనే’ అన్న పదం మూడు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో మార్మోగింది. ఈ మాటలు ఎవరో కాదు మన తొలి తెలుగు ప్రధాని, ఆదర్శనీయుడు అనిపించుకుంటున్న పాములపర్తి వెంకట నరసింహారావు(పీవీ నరసింహారావు) నోటి నుంచి వచ్చాయి. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఇటు దేశంలోనూ సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో ఢిల్లీ పీఠాన్ని ఆధిరోహించిన బహుభాషా కొవిదుడు, అపర చాణుక్యుడు పీవీ. దేశప్రధానిగా అత్యున్నత పదవిని అలంకరించిన ఆయన ఐదేళ్ల పాటు సుస్థిరపాలన అందించారు. ఆయన మరణానంతరం సొంత పార్టీ ఇచ్చిన గౌరవం అత్యంత దారుణమనే చెప్పాలి. దీంతో ఢిల్లీలో ఉండాల్సిన ఆయన చరిత్ర ఎక్కడా లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీలోని ఆయనకు వ్యతిరేకులే కాదు. పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం పట్టించుకోలేదన్న విమర్శలూ లేకపోలేదు. చివరకు పీవీ తనయుడు ప్రభాకర్ రావు తన తండ్రి జ్ఞాపకాలను పదిల పరచడంతో పాటు భావితరాలకు ఆయన జ్ఞాపకాలను అందించాలని సంకల్పించారు.

బుడి బుడి అడుగులతో పీవీ తీరుగాడిన ఆయన సొంత ఇంటినే మ్యూజియంగా మార్చాలని నిర్ణయించారు. అందుకోసం పీవీ వాడిన వస్తువులను ఆయన స్వగ్రామమైన వంగరకు తరలించారు. ఆయన విద్యనభ్యసించి, యవ్వనం వరకున్నా ఆ ఇంటికే వందేళ్ల జ్ఞాపకాలను చేర్చారు. ఆయన వినియోగించిన కళ్లజోడు, ఆయన వెసుకున్న దుస్తువులు, రచనలు, చదివిన పుస్తకాలు, అందుకున్న మెమోంటోలు, కుర్చీ తదితర సామగ్రిని ఢిల్లీ నుంచి తన స్వగ్రామం వంగరకే తీసుకొచ్చారు. అందుకోసం ఆనాడు పీవీ నరసింహారావు పెరిగి పెద్దయినా మిద్దె ఇంటి రూపురేఖలను అలాగే ఉంచుతూ అధునికత సంతరించుకునేలా ముస్తాబు చేస్తున్నారు. ఈ ఇంటికి అనుసంధానంగా నూతనంగా మరో భవనం కట్టించారు. ఈ రెండు భవనాల్లో పీవీకి సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ పర్యటన, ప్రముఖులతో దిగిన పలు చిత్రాలు, అందుకున్న బహుమతులను కూడా ఏర్పాటు ప్రతిష్టిస్తున్నారు.
మెమోరియల్ లేని ప్రధాని
భారత ఆర్థిక సంస్కరణలకు అద్యుడిగా, అపర మేధావిగా ఎదిగి దక్షిణాది రాష్ట్రాల నుంచి తొలి ప్రధానిగా ప్రపంచ వ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు అందుకున్న ఆ మహానేత స్మృతులను భావితరాలకు అందించేందుకు ఢిల్లీలో ఎలాంటి భవనం లేకపోవడం విచిత్రమనే చెప్పాలి. కమ్మూనికేషన్ రంగమే అయినా, నేటి ఆధునిక సమాజం అందిపుచ్చుకున్న సాంకేతికతే అయినా, ఆయన ప్రధానిగా తీసుకున్న సాహసోపేతమైనా నిర్ణయాల ఫలితమేనన్నది నిజం. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా 1985లో బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాల ఫలితమే నేడు మనం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం. మూడున్నర దశాబ్దాల క్రితమే దేశంలో శాస్త్రసాంకేతిక అవసరాలు, భావి జీవితాల్లో కంప్యూటర్ అత్యంత కీలకం కానుందని గ్రహించారు. ఆనాటి తరానికి ముందుగా కంప్యూటర్​పై అవగాహన కల్పించాలని నిర్ణయించిన పీవీ కంప్యూటర్ లిటర్ ఫర్ సెకండరీ స్కూల్(క్లాస్) అనే పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని ప్రతిజిల్లాకు రెండు హైస్కూళ్లలో ఈ స్కీంను అమలుచేసి రెండు కంప్యూటర్లను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేరుగా అందజేశారు. పీవీ నరసింహారావు సొంత జిల్లా కరీంనగర్​లో ఐదు హైస్కూళ్లలో ఈ పథకాన్ని అమలుచేశారు. నవోదయ విద్యాలయాలు సైతం పీవీ రూపకల్పన చేసినవే. ఆర్థికవేత్తగా గుర్తింపు పొందిన యూజీసీ చైర్మన్ గా పనిచేస్తున్న మన్మోహన్ సింగ్​ను కేబినెట్​లోకి చేరుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సోనియాగాంధీ పీవీ నరసింహారావును వ్యతిరేకించి ఆయన ఆనవాళ్లు లేకుండా చేయగలిగారు కానీ ఆయన శిష్యుడిగా ఎదిగిన మన్మోహన్ సింగ్ ను నిలువరించలేకపోయారని ఆయన సహచరులు, రాజకీయ ప్రముఖులు చెబుతుంటారు.
రెండు గజాల జాగా లేదు
భారత ప్రధానిగా పనిచేసి సంస్కరణలకు శ్రీకారం చుట్టిన పీవీ నరసింహారావు చనిపోయే నాటికి ఢిల్లీలో రెండు గజాల స్థలం కూడా కేంద్రంలో అధికారం చేపట్టిన ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని కుటుంబసభ్యులు చెబుతుంటారు. పార్టీ అగ్రనేతలు చెప్పినట్లు వినకపోవడంతోనే కనీసం దక్కాల్సిన గౌరవం దక్కలేదని దేశప్రజలు, కుటుంబసభ్యులు, పార్టీ సీనియర్ నేతలు బాధపడుతుంటారు. ఓ వైపు ప్రజలు, మరోవైపు పార్టీతో కుటుంబంలా జీవించిన మౌనముని మరణిస్తే దహన సంస్కారాలు చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా తండ్రి వందేళ్ల జ్ఞాపకాలను కొడుకు ప్రభాకర్ రావు భద్రపరిచి నేటి తరానికి అందించాలనే గొప్ప సంకల్పంతో తన ఇంటినే మ్యూజియంగా మల్చడం పీవీ బతికున్నాడనే ఆలోచన దేశప్రజలు, నేతల్లో కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.