
హైదరాబాద్: గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ‘సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్’లో భాగంగా ఈ డేటా సెంటర్ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. కాగా, ఈ సెంటర్లో భారీ తెరను ఏర్పాటుచేశారు. దీని మీద ఒకేసారి ఐదువేల సీసీ కెమెరాలకు చెందిన లైవ్ దృశ్యాలను వీక్షించొచ్చు. అలాగే 10 లక్షల సీసీ కెమెరాలకు చెందిన దృశ్యాలను నెల రోజుల పాటు స్టోర్ చేసేలా సర్వర్లను ఏర్పాట్లు చేశారు. అవసరమైతే సర్వర్ల కెపాసిటీని పెంచనున్నారు. మొత్తం 14 మీటర్ల పొడవు, 42 మీటర్ల ఎత్తుతో అర్ధ చంద్రాకారంలో పెద్ద స్ర్కీన్ ఉంటుంది. దాని పక్కనే రెండువైపులా 55 ఇంచుల డిస్ ప్లేలు కలిగిన మరో నాలుగు టీవీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. క్రమంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పలుచోట్ల ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను ఈ సెంటర్లోని భారీతెరపై ఒకేసారి వీక్షించవచ్చు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ అంజనీకుమార్, సైబరాబాద్ సజ్జనార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
