Breaking News

అణచివేతకు అద్దం పట్టిన జాషువా సాహిత్యం

అణచివేతకు అద్దం పట్టిన జాషువా సాహిత్యం

సత్కవి గుర్రం జాషువా భారతరత్న డాక్టర్​బాబాసాహెబ్ అంబేద్కర్ సమకాలికుడు. అంబేద్కర్ కంటే నాలుగేళ్లు చిన్నవాడు. అస్పృశ్యతను చవిచూసిన ఈ కవిరేణ్యుడు తన ఖండ కావ్యం ‘గబ్బిలం’ లో నాటి సామాజిక వ్యవస్థ మూలాలు, అమానవీయ దౌష్ట్యాన్ని కరుణారస భరితంగా వర్ణించి సాహిత్య వేదికపై మానవ జాతిని మేలు కొల్పిన సంఘసంస్కర్త. మరీ ముఖ్యంగా అరుంధతీయుల దుర్భర జీవనగతులను ‘ప్రశ్నించే చైతన్యం’తో అనుసంధించి సమర సతాత్మక ప్రబోధంతో సమాజాన్ని తట్టిలేపిన విశ్వనరుడు. జాతీయోద్యమం స్ఫూర్తితో దేశభక్తి కొత్తపుంతలు తొక్కుతున్న సమయాన పేదల పక్షాన నిలబడ్డ దార్శనికుడు గుర్రం జాషువా.

చిట్టి ‘చందమామ’ కథలతో సంతృప్తి చెందే చిన్నతనంలో ఆత్రంగా చదివిన ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’, గురజాడ ‘కన్యాశుల్కం’, బోయి భీమన్న ‘పాలేరు’, జాషువా ‘గబ్బిలం’ వంటి సాంఘిక నవలలు, నాటికల సారాన్ని సంగ్రహించడానికి ఆరు పదుల వయస్సు మీద పడిన తర్వాత గానీ వీలు చిక్కలేదు. ‘కోవిడ్-19’ బలవంతంగా రుద్దిన విరామ సమయంలోనే దీక్షగా ఈ పుస్తకాల పునఃశ్చరణ వీలైంది. పని ఒత్తిడి, అనవసరమైన తిరుగుడు లేదు కదా !
కులవ్యవస్థను, సామాజిక అంతరాల్ని నిరసిస్తూ వెలువడిన సాహిత్యానికి శతాబ్దాల చరిత్ర ఉంది. పాల్కురి సోమన, యోగి వేమన, దున్నా ఇద్దాసు, పోతులూరి వీరబ్రహ్మం, నారాయణ గురు, చొక్కామేళ.. ఇత్యాది విముక్త కవులు దక్షిణ భారతదేశాన సామాజిక పరివర్తన దిశగా తమదైన ముద్రవేశారు. ఈ పరంపరను ఉత్తరాదిన కూడా సంత్, సాధువులైన రవిదాసు, కబీరు, తుకారాం వంటి సంఘ సంస్కర్తలు కులాధిపత్యాన్ని నిలదీశారు. ఈ ఒరవడిలో స్వానుభవంతో జాషువా కవి శత్రువును సైతం క్షమించాలనే బౌద్ధ సుగుణాన్ని తన రచనల్లో మరింత వెలుగు చూపాడు. స్వాతంత్రోద్య౦ సమయాన దేశ భక్తి మెండుగా, తెలుగు కవితా వేదికగా.
శ్రీ కృష్ణదేవరాయల ఎడబాటు నాలుదిక్కులా, సాహితీ చీకట్లు కమ్మిన సమయాన, తెలుగు కవితా సరస్వతి దారి బత్తెంతో తంజాపురం వైపు వలసపోయిన వేళలో, అపర రాయలైన రఘునాథరాజు తన ఆస్థానంలో ఆశ్రయం ఇచ్చిన వైనం జాషువా కవివర్యుడు తన ఈ ఉద్గంధంలో వర్ణించిన తీరు అజరామరం. చేమకూర వెంకట కవి తెలుగనే పద్మాక్షికి రెండర్థాల మాటలు నేర్పిన సమయం అది. ముద్దు పళని ముద్దులొలికే తన కవిత్వంతో కొంగు చాటు లేని శృంగారానికి తెర లేపిన వేళ అది. మువ్వ గోపాలుణ్ణి స్తుతించేందుకు క్షేత్రయ్య కలం పట్టుకున్న తరుణమది.
ఈ సాహిత్య నేపథ్య నిలువుటద్దం బాసటగా, రఘునాథుడి ఏలుబడిలో తంజావూర్​కు దక్షిణాన నివాసమేర్పరుచుకున్న ఒక అరుంధతీయుడు, అతడు గర్భదరిద్రుడు, తన ఊరట లేని దీనావస్థను స్నేహపూర్వకంగా ఓ పక్షి (గబ్బిలం)కి వివరించే వృత్తాంతమే ఈ ‘గబ్బిలం’ పద్యకృతి జాషువా కావ్యస్మృతి. కుల మదంతో పొగరుకెక్కిన ఈ సమాజంలో పురుగు, పుట్ర కాక పేదలకు ఆప్తులు, ఆత్మీయులు ఎవరున్నారని ప్రశ్నిస్తూనే, అతని గోరువెచ్చటి కన్నీటికి చక్రవాక పక్షులతో వ్యాఖ్యానం పలికించడం మానవతావాదిగా జాషువా కవికే చెల్లింది.
కావ్య నాయకుడిగా చెప్పుకోవలసి వస్తే ఈ అరుంధతీయుడు భరతమాతకు పుట్టిన కడగొట్టు బిడ్డ.. మూల నివాసి. అందరికీ నాలుగు దిక్కులుంటే, ఏ దిక్కూ, మొక్కు లేని ధీనుతడు. సవర్ణులు ఈతనికి ఎన్నో మనో:క్లేశాల్ని మిగిల్చినా, ఏనాడూ వారికి ఎదురు తిరగాలని అనుకోలేదు. పై పెచ్చు వారి పాదాలు కంది పోకుండా చెప్పులు కుట్టి ఇస్తాడు. ఈతడు మాత్రం చెప్పులు తొడుక్కుని సాటి నరుడి కంట పడరాదు. ఈతడు ఆలయాన్ని తాకితే త్రిమూర్తులు కూడా ఉపవాసం ఉండవల్సిందే. ఈతని తలకు నులిమిన బురదను ఆకాశగంగా కూడా కడగలేకపోతుంది. ఈతడు చేసిన సేవకు యావత్తు భారతావని అప్పు పడిందని వాపోతాడు జాషువా కవీంద్రుడు హైందవ సమాజ హితునిగా. కులం లేని పేదవాడిగా, పుట్టు బానిసగా బ్రహ్మచర్య దీక్ష పూనిన ఈ అరుంధతీయుడు, పగలంతా రెక్కలాడించి, సూర్యుణ్ణి సాగనంపి, తన గూటి (గుడిశ)కి చేరి, కాసిన్ని గంజి నీళ్లు తాగి, నిద్రకై కుక్కి మంచంపై మేను వాల్చినాడు ఒకనాడు.
ముక్కూముఖం లేని చీకటి ముద్దలాగ ఉన్న గబ్బిలం(పక్షి) ఒకటి అటు తిరుగాడుతూ వచ్చింది గుడిసెలోకి. దాని రెక్కల గాలికి ఇతని ఇంట ఉన్న ఆముదపు ప్రమిద ఉన్న చందంగా కొండెక్కింది. చీకటిలో దయ్యపు పిల్లలాగా తిరుగుతున్న ఆ తాపసి పిట్టను చూచి, ఇతనిలో కొత్త ఊహలు మొగ్గతొడిగి చిగురించాయి. ఊహాజనీతం మరి. ఆ గబ్బిలాల రాణికి స్వాగతం పలుకుతూ పవిత్ర ఆలయాల్లో తిరుగాడేవు నీవు, ఈ అంటరాని వాడి ‘నిషిద్ధ గృహాని’కి వస్తే ఈ లోకం నిన్ను కూడా బహిష్కరిస్తుందేమో ? ‘ఇది హృదయం లేని లోకం సుమీ !’ అంటూ వాపోతాడు అతడు.
‘జంతు ధర్మం, పక్షిధర్మం నీలో ఉన్నాయని ఇప్పటికే ఈ లోకం నీ ముఖం చూడదు. ఈ నిరుపేదకు అలాంటి పట్టింపులు లేవు. ఈ కాళరాత్రి నా గుండె దిగులు పోగొట్టి, ఆ త్రిశూలధారికి నా ఈ సందేశాన్ని చేరవేద్దువు గానీ, ఆలయంలో తలకిందులుగా వేలాడేటపుడు శివయ్య చెవికి కాస్త దగ్గరగా ఉన్నపుడు, పూజారి లేని వేళలో, నా దీనావస్థను వినిపించు స్వామికి. ‘పూజార్లు వింటే నీకు ప్రాయశ్చిత్తం చేసేరు సుమీ !’ అంటూనే, ఇక్కడ బ్రహ్మాది దేవుళ్లు ధనం గలవాడి అదుపాజ్ఞలో బందీలయ్యారని సెలవిస్తాడు ఈ అరుంధతీయుడు.
ఈ గ్రంథం (గబ్బిలం) కేవలం కవిత్వం కాదు. ఒక అస్పృశ్యుడి ఆర్థనాదం. భారతీయతత్వం, భాషలు, సాంస్కృతిక, చారిత్రాత్మక వైభవాన్ని లోకానికి చాటి జెప్పిన ‘భారత దర్శిని’. అదీ ఒక అరుంధతీయుడి మాద్యం ద్వారా తెలియజేసిన విధంబు ఎట్టనిన. ‘సంసార విషవలయంలో పడి విశ్రాంతి కరువైన ఓ ముని పక్షీ! కొన్ని దినాల పాటు పుణ్య క్షేత్రాలు దర్శించి తరించిరా. మనస్సుకు ఊరట కలుగుతుంది!’ అంటూ గబ్బిలాన్ని కాశీ యాత్రకు, కైలాస దర్శనానికి ఉత్సాహ పరుస్తాడు ఈ అరుంధతీయుడు. ‘రవి గాంచని చోట కవి గాంచును’ అన్న చందంగా, ఆ దారిలో ఎదురయ్యే గుళ్లు, గోపురాలు, మహా నగరాల వర్ణణతో పాటు భారతీయతత్వాన్ని ఒక కష్ట జీవితో లోకానికి ఎరిక పర్చడం ఒక్క జాషువా కవిహృదయుడికే చెల్లింది.
‘ఇంత నీరు, ఒకింత ఫలహారం దొరికితే చాలు నీ చిన్ని పొట్టకు. కొండలు, కొనలు దాటుకుంటూ, ఆకాశమార్గంలో సుడిగాలులు రేగితే ధర్మసత్రాల్లో తలదాచుకుంటూ, ఎన్ని దేశాలు తిరిగినా నీకు ఇబ్బంది లేదు. నీవు నాలాగున అంటరాని వానివి కాదు. పుట్టు బానిసవు అంతకంటే కాదు’ అంటూ తన దీనస్థితికి ఈతను తనలోనే కృంగిపోవడం హృదయ విదారకం. ‘తంజావూరు సరస్వతీ మహల్ని దర్శిస్తూ ఉత్తరదిశగా తెలుగు వారి పొలిమేరాలు దాటి, నెల్లూరు మండల ప్రాభవం స్పృశించు. పెన్నానదిలో తానమాడు.
సంస్కృత కవిత్వానికి ఎల్లలు లేవు. యతి ప్రాసలు లేవు. ఆ భాషలోని భారతాన్ని పంచమవేదం అంటారు. ఇచ్చోటనే మహాకవి తిక్కన పదునైదు పర్వాల భారతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించాడు. నెల్లూరి నెరజాణలు ఎంతటి కవినైనా తికమక పెడుతారట. ఆ వ్యంగంలోని నిజాలను తెలుసుకో.. అంటూ అరుంధతీయుడి నోట బంగారు పలుకులు పలికిస్తాడు జాషువా. హంపీ శిథిలాల్లో నీ బంధువులు (గబ్బిలాలు) గూళ్లు కట్టుకుని నివాసముంటారు. వాళ్లు నీకు ఆతిథ్యమిస్తారు.
‘అక్కడి కొండపై గణేశుడు ఏనుగుగా దర్శనమిస్తాడు. ఆతని నున్నటి బొజ్జ మీద తుమ్మెదలు కూడా నిలదొక్కుకోలేవు. ఎంతో అరుదైన ఆ శిల్పాన్ని విద్యానగరంలోని మన తెలుగు దద్దమ్మలు తుంగ(భద్ర)లో తొక్కారు. ఆ శిల్ప సంపదకు నివాళిగా ఒక కన్నీటి బొట్టు రాల్చు. రత్నాల రాసులతో శోభించిన ఆంధ్రుల వైభవరథం 16వ శతాబ్దిలో భూమిలోకి కృంగిన విషయం నీకు తెలుసులే’ అంటాడు అరుంధతీయుడు పక్షి రాణితో ఆక్రోశంగా.
‘గుంటూరు సీమ చేరుకో దారిలో. నీ జన్మ తరిస్తుంది. రాయడి భాస్కరుడి, హళక్కి భాస్కరుడి ఏలుబడిలో ఈ సీమ ఇతర సీమలకంటే మిన్నగా పెద్దరికం చాటుకుంది. కాలపురుషుడి దుండగాలకు కంచర నగరం కనుమరుగైంది. వినుకొండ కోట బురుజులు నేలమట్టమయ్యాయి. పల్నాటి దొరల పరాక్రమం నాగులేటిలో కలిసిపోయింది. కీర్తివంతమైన కొండవీడు ఉక్కు కత్తుల బావిలో ఒరిగి పోయింది వేడి నెత్తుటితో. పరాక్రమానికి మారుపేరు కోడి పందెం. ఎడతెగని తగాదాలతో తెలుగు రక్తం వ్యర్థమైంది. పల్నాటిలో నేటికీ ఈ దుష్టవినోదం మిగిలి ఉంది. త్రుప్పుపట్టిన కత్తుల ఆరాటం కార్యంపూడి తిరునాళ్లలో ఇప్పటికీ వినిపిస్తుంది’ అంటూ తాను తిరుగాడిన ప్రాంత చరిత్రను అరుంధతీయుడి నోట పలికించిన ఘనాపాటి జాషువా కవి. రెడ్డి రాజుల్లో మునిశ్రేష్టుడు యోగి వేమన. లౌఖిక జీవితంతో విరక్తి చెంది తెలుగు వీధుల్లో పిచ్చివాడిగా ఇచ్చోటనే తిరుగాడినాడట. ఆశువుగా ఆయన చెప్పిన తత్వాలు ‘వినుర వేమా’ గా వినసొంపుగా సాంఘిక విప్లవానికి నాంది పలికాయి.
కృష్ణా నదితీర దివ్యక్షేత్రాల్ని పూజిస్తూ, మేఘాల చాటుగా ముందుకు సాగు. కవి బ్రహ్మ నన్నయ్య నివాస స్థలమైన రాజమహేంద్రవరం చేరుకో. పూర్వ చాళుక్యుల పోషణలో విద్వత్తుతో వెలుగొందిన నగరం ఇది. కన్నడ సారస్వత వీక్షణ, రెండున్నర పర్వాల పాండవుల కథను తెలుగులో మనకందించిన ప్రజ్ఞామూర్తి నన్నయ కవి. విష్ణువర్ధన మహారాజు వైభవ సాక్షిగా, గౌతమి గోదావరి స్వాగతిస్తుంది నిన్ను. పచ్చటి తివాచీలు పరిచినట్టుగా మాగాణాలు ఈ నదికి ఇరువైపులా ఆకర్షణీయాలు. అపవాదును నెత్తికెక్కించుకుని దుర్నీతికి బలి అయిన సారంగధర రాజకుమారుడి దుస్థితికి చింతిస్తూ చిత్రాంగి మెడలోని పావురాలు మూలుగుతూ ఇప్పటికీ కంట పడుతున్నాయి ఇక్కడ.
ద్రాక్షారామం సాక్షాత్తు కాశీ క్షేత్రమే. భీమేశ్వరుడు సాటి లేని దయామయుడు. మహా మహితాత్ముడు. మా కడజాతి వారిని ఉద్దరించే నాథుడతడు. కాబట్టి ఆ స్వామిని సాక్షాత్కరించుకోవడం మరిచిపోకూ. అక్కడి రాణులు నిన్ను చూచి శ్రీనాథ కవి పంపిన కస్తూరి ముద్దగా నిన్ను అదరిస్తారు. భర్త అయిన సముద్రుణ్ణి చేరుకోవడానికి ఉధృతి అల్లలపై ఊరేగుతూ అఖండ గోదావరి దర్శనమిస్తుంది దగ్గరిలోనే. ఋస్సీ దొర కొల్లగొట్టిన వెలమ వీరుల పరాక్రమ జ్వాలలు ఇప్పటికీ బొబ్బిలి కోటలో నిట్టూరిస్తూనే ఉన్నాయి. బొబ్బిలి యుద్ధం తలంపే నీ దేహాన్ని ఆవేశంతో ఆవరిస్తుంది.
పూసపాటి రాజుల నిలయం విజయనగరం. రాయ రహత్తుల గుర్రాలు (దండు) లోకం దద్దరిల్లేలా సక్లించింది ఇక్కడే. రాయల ఖడ్గంతో ఒడిశా సరిహద్దులో నిలిపిన ‘పొట్నూరు’ విజయ స్థంభం ఆంధ్రుల గత వైభవాన్ని గళమెత్తి పడుతూ కనిపిస్తుంది దగ్గరిలో. ఉత్తరాంధ్ర మీదుగా మన్యం అదువులు దాటితే ఓఢ్ర రాజుల గాలులు వీస్తాయి. తెలుగు వెలుగుల జీలుగులు మసక బరుతాయి ఈ దిశగా. తేటనైన తెలుగు భాష లాగా చిలక సముద్రం (సరస్సు) దిక్కులంతా విస్తరించి కనువిందు చేస్తుంది దారిలో. శిథిలమైన బౌద్ధ స్థూపాలతో ప్రాచీన నలందా పాటలీపుత్ర నగరాలు రెండు వేల సంవత్సరాల నాటి మగధ రాజ్యవైభవం చిహ్నాలుగా దర్శనమిస్తాయి మార్గమధ్యంలో.
పిమ్మట మొగలాయి చక్రవర్తుల చంద్రవంక పతాకం రెప రెపలాడే ఢిల్లీ నగరం చేరుకో. ద్వాపర యుగంలో హస్తినగా విలసిల్లింది ఈ నగరమే. పాండవ రాజుల ప్రథముడు ధర్మరాజు పాలనలో ద్రౌపది కొప్పును శత్రు రక్తంతో ముడిచింది భీముడిక్కడే.నాదిర్షా ఇక్కడే తన గొడ్డలికి పదును పెట్టింది. నెమలి ఈకల గద్దెను షాజహాను ప్రతిష్టించింది ఇక్కడే. జయ చంద్రుని కూతుర్ని పృధ్వీరాజు పరిణయమాడింది ఇక్కడే. యుగ యుగాల గాధల్ని తన కడుపులో దాచుకున్న ఈ ఢిల్లీ మకూటపు అందాలు తరగలేదు. శిరస్సు నేరవలేదు నేటికీ. ఒక పక్క పాలిత పీడిత జనం ఆకలితో అలమటిస్తుంటే, సుల్తాన్లు భోగ భాగ్యాలతో ఊయలలూగింది ఇక్కడే. శ్రీకృష్ణ భగవానుణ్ణి వలచి వచ్చిన కాళింది (నది) తన సుకుమారమైన అలల అలరింపుతో నిన్ను ఆగ్రా వైపు ఆకట్టుకుంటుంది. ప్రపంచ సుందరికి సప్త సౌన్ద్ర్యమైన తాజ్ మహల్ నేడు నిద్రావస్థలో ఉంది. అయినప్పటికీ దీని వన్నె నేటికీ తగ్గలేదు. ఈ దృశ్యం దర్శనీయం.. అపురూపం. వేదాల సారాన్ని విరజిమ్మే భగవద్గీతను కుహనా గోపాలుడు లోకానికి బహిర్గతం చేసిన కురుక్షేత్రంలో కాలుమోపడం నీ వీధి. ఓ పక్షి కాంతా!
బోధిసత్వుడి బోధనలతో పునీతమైన కపిలవస్తు నగరంలో రెండు రాత్రులు విడిది చేస్తే నీ జన్మ సార్థకమవుతుంది. లుంబీ వన సువాసనలను ఆస్వాదిస్తూ ఉత్తర దిశగా చూడు. ఎత్తయిన హిమగిరులు నిలుస్తాయి అడ్డంగా నీ కనుచూపు మేరలో. ఎందరో ఆంగ్లేయులు ఆ పర్వతాల ఆరోహణలో ప్రాణాలు కోల్పోయిన ఆనవాళ్ళు ఎన్నెన్నో. అదేమీ చిత్రమో గానీ, ఇక్కడి మంచు బలం ఎటువంటిదో గానీ, నేటికీ కూడా ఆ మృత దేహాలు చెక్కు చెదరలేదు.
పట్టు జారీ ఈ పర్వతాలపై నుంచి తలకిందులుగా జారీ లోయలో పడ్డ మంచు బండల చాటున అక్కడ నివసించే జీవరాశుల కళేబరాలు కోకొల్లలు. బలవంతుల స్నేహం పేదలకు ప్రాణనష్టమే సుమీ..!
ఓ పక్షి సాథ్వీ ! కైలాస యాత్ర చేపట్టిన నీవు నిండు గౌరవానికి అర్హురాలివి. హిమవంతుడితో స్నేహానికి చిహ్నంగా నీ తలపై ఒక మంచు బిందువును చల్లుకో. అవి శివ పర్వతులకు సిఫార్సుగా పనికొస్తుంది. పెద్దల పరిచయం వృథా పోదు కదా..! ఈ మంచు కొండల్ని దాటుకుంటూ పోతే, శివుడి స్థావరమైన త్రివిష్టం నీకు దర్శనమిస్తుంది. దలైలామా రాజుల వింత పాలనలో ఆ ప్రాంతం ఉందిప్పుడు. లామా వంశీయులు సదా సన్యాస దీక్షలో ఉంటారు. పొడవైన టోపీలు ధరించి చిత్రవిచిత్రంగా ఉంటారు. వారి ముందస్తు అనుమతి లేనిదే ఆ ప్రాంతంలో తిరగడం నిషిద్ధం. అయినా పక్షివైన నీవు ప్రవేశింప రాని చోటు లేదు కదా !
మానస సరోవరంలోని జలం సాటి లేనిది. స్వచ్ఛమైంది. దానికి పుట్టిన బుడత గంగ ఎక్కుతూ, దిగుతూ ఉండే ఆ కొండల చక్కదనాన్ని తనివి తీరా చూడు. దమయంతి, నలుడితో రాయబారం సల్పిన బంగారు హంస సంతతి ఈనాటికీ ఈ సరస్సుల్లో శృంగార నైషధ కథల్నీ ఆలపిస్తుంటాయి. పక్షుల భాషలను తెలుసుకునే సామర్థ్యం నీకుందని నాకు తెలుసులే! శివుడు త్రిపురాలను దహించగా ఏర్పడిన బూడిద దిబ్బలు నేటికీ పొగలు గక్కుతూ నీ దగ్గరిలో కనిపిస్తాయి. ఇది చాలా విచిత్రమే కదా ! పాపానికి బలం ఎక్కువే సుమీ !
ఆ సర్వేశ్వరుణ్ణి పూజించి ముందుకు సాగిపో.. మహిషుడి భార్యలు భయపడేలా గర్జించే సింహా వాహన సీతాకతుని ఇల్లాల్ని , దిక్కుల్ని మేలు కొలిపేలా గానం చేసే కుమారస్వామి వాహనమైన నెమలిని, తల మీద మణి రత్నాలతో నాట్యం చేసే సర్పాల్ని చూడు కనులారా. మత్తు కలిగించే గంధపు చెట్ల సువాసనలకు మోసపోయి అక్కడే ఆగేవు. ఆ సుగంధాల్ని అంటిపెట్టుకొని ఉండే మిన్నాగులు నిన్ను కాటు వేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త సుమా..! ఆపదలు ఉన్న చోటుకే మనస్సు ఊరిస్తుంది కదా..!
ఇలా కైలాసయాత్రలో ఎదురయ్యే ప్రమాదాలు, మెళకువలు ఆ పక్షి యాత్రికురాలికి బోధ పరుస్తూ, “పొద్దు పొడిచే వేళ ఇది. బుడ బుక్కల వాడి ఢక్కా శబ్దం ఆలకించు. తూర్పు దిక్కున హైందవ వీధి వాళ్లు లేస్తే మన స్నేహబంధాన్ని శంకించే ప్రమాదం ఉంది. సత్వరమే సాంబశివుడి గుడికి చేరుకో. నా ఈ దుర్గతిని శివయ్య చెవిలో వేయి. నీ తిరుగు ప్రయాణంలో ఆ స్వాముల వారు ఏమన్నది నా చెవిన వేసిపో. వాకిలి లేని ఈ పేద వాని కుటీరం నీ కోసం ఎప్పుడూ తెరిచి ఉంటుంది..”అంటూ అరుంధతీయుడు సాంత్వన పలుకుతుంటే, ఆ నాటి కలకు పరిసమాప్తిగా, ఈతని అభీష్టాన్ని నెరవేర్చడానికా అన్నట్లుగా గబ్బిలం ఆలయం వేపు అడుగులు వేసింది.
నగర కాంత అప్పుడే నిద్ర లేచింది. ఖద్దరు రాట్నం చేత బూనింది. పెదకాపు కేకకు, ఈ బీద కార్మికుడు పంచే ఎగ్గట్టుకొని ముందుకు సాగాడు. ధర్మానికి ఏనాడూ పిరికి తనం లేదు. సత్య వ్యాక్యానికి చావే లేదు. కాబట్టి సర్వేశ్వరుని ముంది మనకేల భయం. మనం అందరమూ సృష్టికర్త ముందు సమానులమే కదా ! అన్న సందేశాత్మక వృత్తాంతమే నవయుగ చక్రవర్తి విరచిత ‘గబ్బిలం’.
పక్షి, జంతుధర్మానికి గబ్బిలం చిహ్నం. మానవ ధర్మానికి కట్టుబడిన వాడు అరుంధతీయుడు. అద్వితీయుడు. ఈ ధర్మాల్ని కలగలిపి ప్రకృతే సాక్షీభూతంగా తెలుగు సాహితీ వనంలో విరబూసిన పుష్పం ఈ పొత్తం. దాని గుబాళింపులు నేటి తరానికి కావాలి మార్గదర్శనాలు. భారతావని సామాజిక సమరకు కావాలి వేదిక.

(మహాకవి జాషువా 125వ జయంతి వారోత్సవాలను పురస్కరించుకుని సమర్పిత ఈ నా వ్యాఖ్యానం)

::: డాక్టర్​ శ్రీనివాసులు దాసరి, ​రిటైర్డ్ ఐఏఎస్,
సంచారి సేవా సంస్థ వ్యవస్థాపకుడు