సారథి న్యూస్, మెదక్: మెదక్ మున్సిపాలిటీ అభివృద్దికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ మున్సిపల్ జనరల్‌బాడీ సమావేశం జిల్లా కలెక్టరేట్ లో చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఇటీవల భారత్ – చైనా సరిహద్దుల్లో అమరవీరులైన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో హరితహారం విజయవంతం చేయాలని కోరారు.
మొక్కలను నాటి ట్రీ గార్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు కలుపు తీయడం వంటి పనులు చేసి వందశాతం మొక్కలు బతికేలా చూడాలని ఆదేశించారు. ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.