సారథి న్యూస్, అనంతపురం : స్వీయ జాగ్రత్తలతోనే కరోనా కట్టడి సాధ్యమని అనంతపురం ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి తెలిపారు. నగరంలోని రెండో రోడ్డులో ఉన్న మెప్మా కార్యాలయం వద్ద గురువారం ర్యాగ్ పిక్కర్స్ (వీధుల్లో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు), నిరాశ్రయ కుటుంబాలకు కోవిడ్-19 కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా టెస్టులు వేగవంతం చేయడానికి ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. అనంతపురంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశముందన్నారు. ఎలాంటి లక్షణం కనిపించినా కోవిడ్- 19 పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రస్తుతం నగరంలో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయని, ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రాకూడదని కోరారు. మెప్మా ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా 1100 కుటుంబాలు గుర్తించామని, వారందరికీ కోవిడ్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు తీసుకొస్తోందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇళ్లు, పింఛన్, రేషన్ కార్డులు పొందడానికి సచివాలయాల్లో సిబ్బంది సంప్రదించాలని తెలిపారు. కరోనా పై ఎవరూ ఆందోళన చెందకుండా, ప్రజలకు అవగాహన కల్పించాలని మెప్మా సిబ్బందికి సూచించారు.