Breaking News

సినిమాటోగ్రాఫర్ కన్నన్ ఇకలేరు

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బీ కన్నన్(69) అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవలే వైద్యులు శస్త్రచికిత్సచేశారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. శనివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించి మృతి చెందారు. కన్నన్.. లెజండరీ డైరెక్టర్ భీమ్ సింగ్ కుమారుడు. ప్రముఖ ఎడిటర్ బీ లెనిన్ కు సోదరుడు. కన్నన్ తమిళంతో పాటు తెలుగు మలయాళ చిత్రాలకు కూడా కెమెరామెన్ గా పనిచేశారు. తమిళ దర్శకుడు భారతీరాజాతో కలిసి దాదాపు 40 సినిమాలకి పనిచేశారు. అందుకే ఆయన్ను ‘భారతీరాజా కళ్లు’ అని పిలుస్తుంటారు. నలభై ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీకి సేవలు అందించిన కన్నన్ తెలుగులో పగడాల పడవ, కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, ఆరాధన చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. ఆయన మృతికి సినీ ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీలోకం ఓ గొప్పవ్యక్తిని కోల్పోయింది అంటూ నటి ఖుష్బూ ట్వీట్ చేశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలున్నారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం.