Breaking News

సిటీలో భారీ వర్షం

సారథి న్యూస్​, హైదరాబాద్: వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటిమొన్నటి వరకు భరించలేని ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్​ మహా నగరవాసులకు కాసింత ఉపశమనం దొరికింది. నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. ఈదురుగాలులకు పైకప్పు రేకులు లేచిపోయాయి. ఎల్​బీ నగర్​, వనస్థలిపురం, తార్నాక, బంజారాహిల్స్​, హయత్​ నగర్​, తుర్కయంజాల్​, నల్లకుంట, ఎల్బీనగర్​, అంబర్​పేట, కీసర, మాల్కాజ్​గిరి, చంపాపేట, తార్నాక, హబ్సిగూడ, సరూర్​నగర్​ తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. అలాగే ఈదురుగాలులకు చాలాచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి.

కరెంట్​ సరఫరాకు అంతరాయం కలిగింది. హైదరాబాద్​లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జీహెచ్ఎంసీ మరింత అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో సిబ్బందిని హెచ్చరించింది. జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. చత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.