చిన్న హీరోయినే అయినా పెద్ద మనసు ఉంది ప్రణీత శుభాష్ కు. లాక్ డౌన్ మొదలైన నుంచి సమీపంలో ఉన్న పేదలకు తనవంతు సాయం చేస్తూనే ఉంది. కొద్దిరోజుల క్రితం ఆహారాన్ని స్వయంగా తానే వండి దగ్గరలో ఉన్న పేదవారందరికీ పంచింది. దాదాపు లాక్ డౌన్ పూర్తవుతున్న సందర్భంగా అందరూ ఎవరి పనుల్లో వారు చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సమయంలో ముఖ్యంగా స్పందించాల్సింది ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ. అధికసంఖ్యలో ఆటోలకే ప్రయారిటీ ఉన్న దేశం కనుక ఆటో డ్రైవర్లు తమ విధుల్లో జాయిన్ అవుతున్నారు. వారి భద్రతను గుర్తిస్తూ ఆటోల ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం ప్రణీత మళ్లీ మరోసారి ముందుకొచ్చింది.
ఈసారి దాదాపు 150 మంది ఆటో డ్రైవర్లకు ట్రాన్సఫరెంట్ షీల్డ్స్, శానిటైజర్, గ్లవ్స్‌ను ప్రణీత ఫౌండేషన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అంతేకాదు ప్రయాణికులు సేఫ్‌గా కూర్చునేందుకు ఆటో లోపలి భాగాలను కూడా సవ్యంగా ఉండేలా ఏర్పాటుచేస్తోంది.. ఈ పనులన్నీ చూసుకునేందుకు ఓ ఎనిమిది మంది వలంటీర్లను కూడా నియమించింది. ప్రణీత సేవలకు ఉప్పొంగిన అభిమానులు ఆమెను సోషల్ మీడియాలో అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇదే విషయం గురించి ప్రణీత ఇలా చెప్పుకొచ్చింది. ‘రోజుకు నాలుగైదు గంటలు నేనీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. ఒక్క పూట గడవని వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాగే సేఫ్ జర్నీ కూడా చాలా ముఖ్యం. అందుకే నేనీ పనులు చేపట్టా.. ఇది మన కనీస బాధ్యత అనుకుంటున్నాను.. దీనికి నాకు కేవలం అభిమానుల ప్రశంసలే కాదు.. చాలామంది అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ సైతం నన్ను, నా టీమ్‌ను మెచ్చుకుంటున్నారు..’ అంటోంది ప్రణీత. నిజమే మరి ఆమె చేసే ఈ పనికి మెచ్చుకుని తీరాల్సిందే అంటున్నారంతా.