సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వారియర్స్‌లో ప్రధానమైన డాక్టర్లు, వైద్యసిబ్బంది ఇప్పుడు వణికిపోతున్నారు. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య దారుణంగా పడిపోతోంది. వారికి రాత్రింబవళ్లు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు కూడా ఇప్పుడు వైరస్ సోకుతోంది. కరోనా బారిన పడుతున్న డాక్టర్లు, వైద్యసిబ్బంది సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. దీంతో వారితో పాటు సాధారణ జనాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. పైగా కరోనా చికిత్స చేసే డాక్టర్ల సంఖ్య ఇంకా తక్కువగా ఉంది. కరోనా రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో వారికి చికిత్స అందించేందుకు వైద్యసిబ్బంది రేయింబవళ్లు ఆస్పత్రిలోనే ఉండి వైద్య సేవలందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కూడా కరోనా సోకితే పరిస్థితి దారుణంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.
ఇప్పటికే ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో కరోనా కలకలం రేపుతోంది. అక్కడ ఏకంగా 480 మంది వైద్యసిబ్బందికి కరోనా అంటుకుంది. ఇందులో 19మంది డాక్టర్లు, 38మంది నర్సులు, 74మంది సెక్యూరిటీ గార్డులు, 75మంది అటెండర్లు, 54మంది శానిటేషన్ సిబ్బందితో పాటు ఇంకా అనేక విభాగాలకు చెందిన వారు ఈ మహమ్మరి బారినపడ్డారు. ఇప్పటికే ఈ ఆస్పత్రిలో ముగ్గురు వైద్యసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో కూడా కరోనా విజృంభిస్తోంది. ఇక్కడ డాక్టర్లకు కూడా వైరస్ సోకింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు పీజీ డాక్టర్లు, ఒక సీనియర్ ఫ్యాకల్టీకి కరోనా వచ్చింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఏకంగా 33మంది జూనియర్ డాక్టర్లు ఈ మహమ్మారి బారినపడ్డారు. హాస్టళ్లలో ఉంటున్న మిగతా మెడికల్ విద్యార్థులకు కూడా టెస్టులు చేస్తున్నారు. ఇందులో ఎంతమందికి పాజిటివ్ వస్తుందోనని వారు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక నిమ్స్ ఆస్పత్రిలో కూడా ఇప్పటికే 30మందికి కరోనా వచ్చింది. తెలంగాణలో కరోనా చికిత్స అందిస్తున్న ఈ మూడు ఆస్పత్రుల్లోనే ఇప్పటి వరకు 45మంది డాక్టర్లకు కరోనా సోకింది. కరోనా నియంత్రణలో ఉన్న వైద్య సిబ్బందికే వైరస్ ప్రబలడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వైద్యసిబ్బందికి ఎలా సోకింది ?
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు కావాల్సిన రక్షణ పరికరాలు, పీపీఈ కిట్లు పూర్తిస్థాయిలో ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి. తెలంగాణ సర్కారు అయితే కావాల్సిన వాటికంటే ఎక్కువగానే ఉన్నాయని, వాటిని వైద్య సిబ్బందికి అందజేశామని చెప్పింది. వైద్యసిబ్బందికి సరిపోను పీపీఈ కిట్లు లేవని రాసిన ఓ పత్రికపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఆ వార్త రాసిన విలేకరికి, యాజమాన్యానికి కరోనా రావాలని శాపనార్థాలు పెట్టారు. కానీ, ఇప్పుడు తెలంగాణలోని వైద్యసిబ్బందికి అన్నిరకాల రక్షణ పరికరాలు ప్రభుత్వం అందజేస్తే వారికి వైరస్ ఎలా వ్యాపించిందన్నది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై జనం చర్చించుకోవడమే కాదు.. ఇదే అనుమానం రాష్ట్ర హైకోర్టుకు కూడా వచ్చింది. అందుకే ప్రభుత్వం అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటే ఇప్పుడు అంతమంది వైద్య సిబ్బందికి వైరస్ ఎలా వ్యాపించిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు హైకోర్టుకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి మరి.