Breaking News

రైతు వేదికలు ముస్తాబు

రైతు వేదికలు ముస్తాబు

  • దసరా రోజున భవనాల ప్రారంభోత్సవం
  • జోగుళాంబ గద్వాల జిల్లాలో నిర్మాణాలు పూర్తి

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): వ్యవసాయమే పరమావధిగా భావించే రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత చేయూతనందిస్తోంది. రైతుల ఆలోచనలు, అధికారుల సూచనలను పంచుకునేందుకు వీలుగా సీఎం కేసీఆర్​రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కనీసం రెండువేల మంది రైతులు ఒకేసారి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవగాహన సదస్సుకు హాజరయ్యేలా అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 97భవనాల నిర్మాణాలు చేపట్టారు. ఒక్కో వేదికను సుమారు రూ.22 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. మానవపాడు మండలంలో ఏడు, ఇటిక్యాల మండలంలో 12, ఉండవెళ్లి మండలంలో ఏడు, రాజోలి ఆరు, అలంపూర్ మండలంలో నాలుగు, అయిజ మండలంలో 10, వడ్డేపల్లి మండలంలో నాలుగు, మల్డకల్ 9, గద్వాల 9, గట్టు మండలంలో 11, ధరూర్ మండలంలో 8, కేటీదొడ్డి మండలంలో ఏడు చొప్పున నిర్మిస్తున్నారు. అదేవిధంగా మూడు మున్సిపాలిటీల్లో మూడు భవనాలు.. మొత్తం 97 భవనాలు వీటికి సుమారు రూ.21.34 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించింది. రైతువేదిక నిర్మాణం పూర్తికాగానే రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు వీటిని ప్రారంభించనున్నారు. దసరా పండుగకు రైతువేదిక భవనాలను ప్రారంభించి రైతులకు వెన్నంటి ఉండేలా భవనాలను సిద్ధం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ ​రైతుల పక్షపాతి

ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ రైతు ప్రభుత్వంగా సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారు. రైతు పక్షపాతిగా వ్యవహరించడం సంతోషకరం. ప్రతి మండలంలో 4 నుంచి నుంచి 10 భవనాల వరకు రైతు వేదిక భవనాలు నిర్మిస్తున్నాం. దసరా పండుగకు రైతులకు రైతు భవనాలను కానుకగా ఇవ్వడం హర్షణీయం.
:: సరిత, జడ్పీ చైర్​పర్సన్​, జోగుళాంబ గద్వాల

రైతులకు వేదికగా ఉంటుంది

రైతు వేదిక భవన నిర్మాణలతో రైతుల సమస్యలను చర్చించుటకు రైతు వేదిక భవనాలు వేదికగా మారుతాయి. ఏ ప్రభుత్వం రైతుల కోసం పథకాలు చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదిక భవనాలు, రైతు బంధు, రైతుభీమా పథకాలు రైతులకు అందించి అండగా నిలిచింది. రైతులకు వెన్నంటి ఉన్నది టీఆర్ఎస్​ ప్రభుత్వం మాత్రమే.
:: ఆత్మలింగారెడ్డి, సర్పంచ్​లు సంఘం అధ్యక్షుడు

రైతులకు భరోసా

రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్. గ్రామగ్రామంలో రైతు వేదికలను ఏర్పాటుచేసింది. రైతులు అక్కడ ధాన్యం సమకూర్చుకోవడంతో పాటు తమ సమస్యలను చర్చించుకునేందుకు వీలుగా ఉంటుంది.
:: దామోదర్ రెడ్డి, రైతు, మానవపాడు