- రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిపోయింది
- ఉద్యోగుల వేతనాల్లో కోత తప్పదు
- ఈనెలలోనూ ఒక్కొక్కరికి రూ.12కేజీల బియ్యం
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష
- పాల్గొన్న సీఎస్, ఇతర ఉన్నతాధికారులు
సారథి న్యూస్, హైదరాబాద్: లాక్ డౌన్ తో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోయిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చినా ఆదాయం పెరగలేదని చెప్పారు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా లేదని తెలిపారు. ఏడాదికి రూ.37,400 కోట్లను వడ్డీలుగా కట్టాల్సి ఉందని, అప్పులను రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదన్నారు. ఎఫ్బీఆర్ఎం పరిమితి పెంచినా కేంద్రం విధించిన కారణాలతో అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు.
ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, ఇతర సీనియర్ అధికారులతో చర్చించారు. పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం మే నెలలో కూడా ఇస్తామని చెప్పారు. లాక్ డౌన్ సడలింపుల వల్ల కూలీలు, కార్మికులకు మళ్లీ పని లభిస్తుందన్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన పేదలకు రూ.1,500 ఇచ్చే కార్యక్రమం ఇకపై కొనసాగదని సీఎం స్పష్టంచేశారు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75శాతం, అఖిలభారత సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్ల నుంచి 25 శాతం కోతలను కొనసాగించనున్నట్టు స్పష్టం చేశారు.
బస్సు సర్వీసులకు మినహాయింపు
టీఎస్ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మే 28(గురువారం) నుంచి యథావిధిగా ఆర్టీసీ సర్వీసులు కొనసాగనుండగా, జిల్లాల నుంచి వచ్చే బస్సులకు హైదరాబాద్‌లోని జేబీఎస్, ఎంజీబీఎస్ లోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఇక సిటీలో బస్సులు తిరిగేందుకు నిరాకరించారు. ఈ బస్సులపై నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేశారు. బస్టాండ్‌లోకి ట్యాక్సీలు, ఆటోలనూ అనుమతిస్తున్నామని ప్రకటించారు. అంతరాష్ట్ర ఆర్టీసీ సర్వీసులకు అనుమతిలేదని తేల్చిచెప్పారు.
ఎన్నో సాధించినం
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎన్నో మైలు రాళ్లను అధిగమిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతోందని సీఎం కేసీఆర్ అన్నారు. ముందుచూపుతో చేపట్టిన బృహత్తరమైన సాగు నీటి ప్రాజెక్టులు నేడు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. గుక్కెడు నీళ్లు, బుక్కెడు బువ్వ కోసం అల్లాడిన తెలంగాణ నేడు దేశానికే తిండిపెట్టే స్థాయికి ఎదగడం గొప్ప విషయం అన్నారు. ధాన్యం సేకరణే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పెరిగిన సాగునీటి లభ్యత, ఉచిత విద్యుత్ ను వినియోగించుకుని రైతులు తమ వృత్తినైపుణ్యంతో పంటలు పండించారని సీఎం కేసీఆర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు.