న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో డిమాండ్ లేవనెత్తారు. కాంగ్రెస్ లీడర్లతో ఫ్యామిలీకి సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కాగా, చాలామంది సీనియర్ లీడర్లు ఆ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ కూడా దీనిపై స్పందించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఇంకా యాక్టివ్‌గా ఉండాలని, ఆయన ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని కోరారు. సీనియర్ రాజకీయ నాయకుడు శరద్‌పవార్ ఇచ్చిన సలహాలను రాహుల్ గాంధీ పాటించాలని సూచించారు.
‘రాహుల్ భిన్నంగా ఉంటారని, భిన్నంగా రాజకీయం చేయాలని నేను అంగీకరిస్తాను. మేము అతన్ని అనుమతించాలి. అప్పుడు అతను పార్లమెంట్లో ఇంకా చురుగ్గా ఉండాలి. ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని మేం కోరుకుంటున్నాం. శరద్ పవార్ సలహా ప్రకారం ఆయన దేశ యాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి’ అని దిగ్విజయ్‌సింగ్ ట్వీట్ చేశారు. ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు రావాలని, రాహుల్ గాంధీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి పార్టీని నడిపించాలని, యువతకు పెద్ద పీట వేయాలని కొన్ని రోజులుగా కాంగ్రెస్ యువనాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.