ప్రతాప్‌ఘడ్: అత్యాచారం చేసే వారిని శిక్షించేందుకు కఠిన శిక్షలు వచ్చినా.. ఉరిశిక్ష విధించి చంపినా కొంత మంది మృగాలకు బుద్ధి రావడం లేదు. మహిళల రక్షణ కరువైంది. దాదాపు పది ఏండ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతం చోటుచేసుకున్న రీతిలోనే యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో అలాంటి తరహా ఘటనే జరిగింది. కదులుతున్న బస్సులో ఒక మహిళపై కొంత మంది అత్యాచారానికి పాల్పడ్డారు. పిల్లలను చంపుతామని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
యూపీలోని ప్రతాప్‌ఘడ్ నుంచి నోయిడాకు వెళ్లేందుకు 25 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సు ఎక్కింది. గమనించిన డ్రైవర్ ఆమెను బస్సులోని చివరి సీటులో కూర్చోవాలని చెప్పాడు. ఆ తర్వాత అదును చూసుకుని పిల్లల్ని చంపేస్తానని బెదిరించి స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బస్సు దిగిన వెంటనే ఆ మహిళ భర్త సహకారంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.