ఢిల్లీ: వివిధ రకాల రుణాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మారటోరియాన్ని మరో రెండేండ్ల పాటు పొడగించాలని కేంద్రం యోచిస్తోంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీపై చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ అంశంపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. మరో రెండేండ్లపాటు మారటోరియం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. అయితే మారటోరియం సమయంలో వడ్డీని మాత్రం వసూలు చేస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై అత్యున్నత ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయంగా ఆలోచించి వడ్డీ మాఫీ చేయాలని కేంద్రానికి సూచించింది.
కరోనా మహమ్మారితో ఇప్పటికే దేశ జీడీపీ వృద్ధిరేటు దారుణంగా పడిపోయిందని మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కరోనా మహమ్మారి కారణంగా పలువురు ఉపాధి కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో వారికి ఊరట కల్పించేందుకు ఆర్బీఐ రుణాలపై మారటోరియం ప్రకటించింది. అయితే మారటోరియం కాలంలోనూ వడ్డీ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో మారటోరియం వల్ల రుణాలు చెల్లించే వ్యవధి మాత్రమే పెరుగుతుందని.. వడ్డీ విధించడం వల్ల సామాన్యులకు లాభమేమిటని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. కొందరు సామాజికవేత్తలు వడ్డీని తగ్గించాలంటూ కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. రేపు ఈ కేసుపై పూర్తిస్థాయిలో ప్రభుత్వ వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది.