- ఢిల్లీలో సెర్చింగ్ ముమ్మరం చేసిన పోలీసులు
- దుబే ప్రధాన అనుచరుడు ఎన్‌కౌంటర్
ఫరీదాబాద్, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసుల హత్యకు కారణమైన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను ఢిల్లీ దగర్లోని ఫరీదాబాద్‌లో ఒక హోటల్‌లో పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం హోటల్‌లో రైడ్ చేసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు హోటల్‌కు చేరుకునే కొద్ది నిమిషాల ముందే వికాస్ హోటల్ నుంచి వెళ్లిపోయాడని మేనేజర్ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వికాస్ మాస్క్ పెట్టుకుని ఉన్నట్లు రికార్డ్ అయింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు వికాస్ పక్కనే ఉన్నట్లు కూడా పోలీసులు గమనించారు. యూపీలోని కాన్పూర్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్, 60 కేసుల్లో నిందితుడైన వికాస్‌ను పట్టుకునేందుకు పోలీసుల టీమ్ వెళ్లగా.. వికాస్, ఆయన అనుచరులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో 8 మంది పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. శుక్రవారం ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న వికాస్ కోసం 25 పోలీస్ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయి. అతనిపై రూ.2.5లక్షల రివార్డు కూడా ప్రకటించారు.
వికాస్ సన్నిహితుడు ఎన్‌కౌంటర్
వికాస్ దుబే ప్రధాన అనుచరుడు అమర్ దూబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. యూపీలోని హమీర్‌పూర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో దాకున్న అతడిని యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ చేశారు. అమర్ దుబే ఉన్నాడనే పక్కా సమాచారంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించాడని, ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు చెప్పారు.