సారథి న్యూస్, భువనేశ్వర్: పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక సోమవారం తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భువనేశ్వర్‌లోని డుమ్డుమా ఏరియా ఫేజ్-2 లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన పై సమాచారమందుకున్న పోలీసులు బాలిక ఇంటికి చేరుకొని.. మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు గానీ, గుర్తులు కానీ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని, బాలిక కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని భావిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రష్మి మోహపాత్రా తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల కారణాన్ని తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. మృతి చెందిన బాలిక నివాస ప్రాంతంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులు గమనించి.. అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఆ యువకుడు బాలికతో ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకున్నాడు. ఈ వ్యవహారం కారణంగానే బాలిక ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసులు కీలక విషయాలు బయటపడతాయని చెప్పారు. బాలిక కుటుంబ సభ్యులు మాత్రం తమ కూతురిని గుర్తు తెలియని దుండగులు చంపారని అంటున్నారు.