- నవంబర్ 20 నుంచి ‘తుంగభద్ర’ పుష్కరాలు
- కోవిడ్–19 నిబంధనలు తప్పనిసరి పాటించాల్సిందే
- పుష్కర ఘాట్ల పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సారథి న్యూస్, కర్నూలు, మంత్రాలయం: ఈ ఏడాది నవంబర్20 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు నిర్వహించే తుంగభద్ర నది పుష్కరాలకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కౌతాళం మండలం మేలిగనూరు పుష్కర్‌ఘాట్–1, మంత్రాయంలోని కాచాపురం పుష్కర ఘాట్–2, రామలింగేశ్వర స్వామి దేవాయం రాంపురం పుష్కర ఘాట్-3, మంత్రాయం పుష్కర ఘాట్–4, 5, నందవరం మండం నాగదిన్నె పుష్కర ఘాట్, గురజాల పుష్కర స్నానాల ఘాట్లను కలెక్టర్ జి.వీరపాండియన్‌తో పాటు జేసీ–3 సయ్యద్‌ఖాజా మొహిద్దీన్, ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప, ఆర్డీవో రామకృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది తుంగభద్ర పుష్కరాలను భక్తుల సంప్రదాయం ప్రకారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ దర్శన్.. ఈ టికెట్
కోవిడ్-19 నేపథ్యంలో తక్కువ ఘాట్లలో ఎక్కువ మంది రాకుండా ఉండేందుకు చర్యు తీసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండియన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మాస్కు లేకుండా భక్తులెవరూ పుష్కర ఘాట్‌కు రాకూడదని, ఘాట్‌లో స్నానాలు చేసేందుకు 12 ఏళ్లలోపు చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, కోవిడ్లక్షణాలు ఉన్నవారిని ఎట్టిపరిస్థితిలోనూ అనుమతించేదిలేదన్నారు. ఈ ఏడాది వెబ్సైట్లో ఈ –దర్శన్ ఈ టికెట్ విధానం తీసుకొస్తున్నట్లు సూచించారు. పవిత్ర తుంగభద్ర నది నీటిని వాటర్ బాటిల్ రూపంలో భక్తులకు అవసరమైన వారికి పంపించేలా అధికారులతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో పుష్కరాలకు ఎక్కువ సంఖ్యలో అనుమతి ఉండదని, తుంగభద్ర పుష్కరాలకు రాని భక్తుల కోసం ప్రత్యేకంగా లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుష్కరఘాట్లు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు వంటి పనులను పారదర్శకంగా, నాణ్యతతో వేగంగా పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.