సారథి న్యూస్, హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు ఈ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నల్లగొండ ఎంపీ, పీసీసీ చీఫ్ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తాను రాష్ట్రపతి భవన్ లో ప్రొటోకాల్ ఆఫీసర్ గా ఉన్నానని గుర్తుచేశారు. ఆ సమయంలోనే తనకు ఆయనతో అనేక విషయాలు చర్చించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పీవీతో కలిసి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వచ్చిందన్నారు. గాంధీభవన్ లో సోమవారం పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు వీ.హనుమంతరావు అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ ముఖ్యవక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పీవీ భూ సంస్కరణలు చాలా గొప్పవని, భూమి లేని పేదలకు భూములు ఇచ్చి వారిని గౌరవప్రదంగా చూడాలని కోరుకోవడం గొప్ప విషయమన్నారు. కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటిస్తుందన్నారు. ప్రధానంగా దళితులు, పేదలను అభివృద్ధి చేసేందుకు పాటుపడిందన్నారు. నేటికి తెలంగాణ రాష్ర్టంలో 12వేల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. ఎవరెవరో ఏదేదో ప్రకటించారు. కానీ వారు ఏమి చేయలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
పీవీ..ఆర్థిక సంస్కరణల కర్త
అనంతరం మాజీమంత్రి జె.గీతారెడ్డి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణల కర్త అని, ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా కచ్చితంగా ఉండేవని గుర్తుచేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేశం కోసం తపించిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. ఆయనను దేశం ఎన్నటికి మరిచిపోదన్నారు.
పీవీ ఇలా అన్నారు..
సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అవసరం ఈ సమాజానికి చాలా అవసరమన్నారు. పీవీ తనతో మాట్లాడుతూ తాను భూ సంస్కరణలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో, ఆర్థిక సంస్కరణలు అమలుచేసి కేంద్రంలో ఓడిపోయానని అన్నారని గుర్తుచేశారు. ఆయన హయాంలో మూడున్నర లక్షల ఎకరాల భూమిని రెండున్నర లక్షల మందికి పంపిణీ చేశారని గుర్తుచేశారు. అన్ని బిల్లులు సెలెక్ట్ కమిటీకి పోకుండా చట్టాలు కావొద్దని పీవీయే చేశారని అన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డివిరిచే మూడు వ్యవసాయ బిల్లులను ఏకపక్షంగా అమలు చేసిందన్నారు. ఢిల్లీలో రైతుల చేస్తున్న ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు.
పీవీ అగ్రకులంలో పుట్టినా..
వీహెచ్హనుమంతరావు మాట్లాడుతూ.. పీవీ అగ్రకులంలో పుట్టినా వెనకబడిన వారి కోసం తపించే వ్యక్తి అని అన్నారు. ఆయన హయాంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. అంతకుముందు పీవీ చిత్రపటానికి కాంగ్రెస్నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రైతు బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేస్తున్న రైతుసంఘాలకు సంఘీభావం ప్రకటిస్తూ తీర్మానం చేశారు. ఎమ్యెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, కమిటీ అధ్యక్షురాలు గీతారెడ్డి, ఉపాధ్యక్షుడు డి.శ్రీధర్ బాబు, కన్వీనర్ మహేష్ గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, కోదండరెడ్డి, మాజీమంత్రి జి.వినోద్ కుమార్ పాల్గొన్నారు.