Breaking News

నియంత్రిత సాగు గొప్ప విప్లవానికి నాంది

నియంత్రిత సాగు గొప్ప విప్లవానికి నాంది

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత సాగు పద్ధతిలో ఈ సారి వానాకాలం పంటలు వేసిన రైతులను రాష్ట్ర కేబినెట్ అభినందించింది. నియంత్రిత పద్ధతిలో సాగువిధానం వ్యవసాయ రంగంలో గొప్ప విప్లవానికి నాంది అని, ప్రభుత్వం చెప్పింది తమకోసమే అని రైతులు గ్రహించడం వారి చైతన్యానికి నిదర్శనమని కేబినెట్ అభిప్రాయపడింది. బుధవారం సీఎం కేసీఆర్​అధ్యక్షతన సమావేశమైన కేబినెట్​తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు వనరులు.. వ్యవసాయ సంబంధిత అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించారు.

నియంత్రిత పద్ధతి ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు వేశారని, మరో 10-12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. గత వానాకాలంలో రాష్ట్రంలో 1.22 కోట్ల ఎకరాల్లో సాగయితే, ఈ సారి 1.3 కోట్లకు పైగా ఎకరాల్లో సాగు జరుగుతోందని వారు వివరించారు. తెలంగాణలో వ్యవసాయ విస్తీర్ణం, పంటల దిగుబడి పెరగడం పట్ల కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ వ్యవసాయం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని, ఇటీవల ఎఫ్ సీఐ సేకరించిన ధాన్యంలో రాష్ట్రం వాటా 55 శాతంగా తేలడం ఈ విషయం నిరూపించిందని కేబినెట్ అభిప్రాయపడింది. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న రైతుబంధు ద్వారా ఈ వానాకాలంలో ఒకేసారి పెద్ద మొత్తంలో రైతులకు నగదు సహాయం అందిందని, కరోనా కష్టకాలంలోనూ ఇది రైతులకు పెద్ద సహాయంగా ఉపయోగపడిందని మంత్రులు అన్నారు.
యాంత్రీకరణ పెంచాలి
కోటి 45 లక్షల ఎకరాలకు సంబంధించి, 57.62 లక్షల మంది రైతులకు, రూ.7,251 కోట్లు అందించడం అసాధారణమని పేర్కొన్నారు. ఇంకా ఎక్కడైనా రైతులు మిగిలిపోయినా వారిని గుర్తించి సహాయం అందించాలని అధికారులను కోరింది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచాలని సీఎం కేసీఆర్​సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని కోరారు. రైతు వేదికలకు స్థలాలు ఇచ్చిన రైతుల పేర్లు పెట్టాలని సూచించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు పెట్టాలి
వ్యవసాయం లాభసాటిగా మారడం, పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు పెట్టాలనే సీఎం నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. రైతులకు లాభసాటి ధర రావడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు నెలకొల్పాలని అభిప్రాయపడింది. ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలోనే మంత్రులు, అధికారులు సమావేశమై విధాన రూపకల్పన చేస్తారని స్పష్టంచేసింది.