న్యూఢిల్లీ: గణాంకాలు, రికార్డుల పరంగా భారత్‌లో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరంటే ఠక్కున సచిన్ టెండూల్కర్ పేరు చెబుతారు. కానీ అభిమానులు మాత్రం మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌కు ఓటేశారు. 50 ఏళ్లలో భారత క్రికెట్లో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరని విజ్డెన్ ఇండియా ఓ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. మొత్తం 16 మంది పోటీపడగా చివరకు వచ్చేసరికి సచిన్, ద్రవిడ్, గవాస్కర్, కోహ్లీ నిలబడ్డారు. వీళ్ల మధ్య ఓటింగ్ రేస్ హోరాహోరీగా సాగింది.
ఆఖరిలో సచిన్‌ను అధిగమిస్తూ ద్రవిడ్ నంబర్‌వన్ స్థానంలో నిలిచాడు. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో గవాస్కర్.. కోహ్లీపై గెలిచాడు. మొత్తం 11,400 మంది ఈ ఓటింగ్‌లో పాల్గొనగా, 52 శాతం ద్రవిడ్‌కు మద్దతుగా నిలిచారు. ప్రపంచ ఆల్‌టైమ్ జాబితాలో సచిన్, ద్రవిడ్ గొప్ప క్రికెటర్లే అయినా.. ఇద్దరి ఆట మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. 164 టెస్టుల్లో ద్రవిడ్ 52.31 సగటుతో 13,288 పరుగులు చేయగా, సచిన్ 200 టెస్టుల్లో 53.78 సగటుతో 15,921 పరుగులు సాధించాడు. మాస్టర్ 51 సెంచరీలు, ద్రవిడ్ 36 సెంచరీలు సాధించాడు.