సారథిన్యూస్, నిజామాబాద్: కరోనాతో జనాలు ఇబ్బందులు పడుతుంటే.. ఇదే అదనుగా చేసుకొని నిజామాబాద్ జిల్లాలో మెడికల్ దుకాణాలు దోపిడీ పర్వానికి తెరలేపాయి. కరోనా మందులను ఎమ్మార్పీ కంటే రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చాలా చోట్ల కృత్రిమ కొరత సృష్టించి పేదప్రజలను నిలువునా ముంచుతున్నారు. ప్రజలు వైద్యం కోసం ఉన్న బంగారం, ఆస్తులు అమ్ముకుంటున్నారు. కాగా ఈ దోపిడీ దందాపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. జిల్లాలోని మెడికల్ షాపులను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, డ్రగ్ ఏడీ రాజ్యలక్ష్మి ఆదేశించారు. అధికధరలకు విక్రయిస్తున్న షాపుల లైసెన్స్ రద్దు చేయాలని సూచించారు. జిల్లాలో కరోనా పరీక్షలను పెంచుతామని, ప్రజల ఆరోగ్యాలను కాపాడుతామని పేర్కొన్నారు.