Breaking News

‘డెమోక్రసీని నాశనం చేస్తున్నారు’

జైపూర్‌‌, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌ షా కలిసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మండిపడ్డారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తుంటే వీళ్లు మాత్రం ఎమ్మెల్యేలను కొనే పనిలో ఉన్నారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. శుక్రవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాలు చెప్పారు.

‘రెండు రాజ్యసభ సీట్లు గెలుచుకునేందుకు కావాల్సిన సపోర్ట్‌ మాకు ఉంది. మాకు సపోర్ట్‌ లేదని వస్తున్న వార్తలను నమ్మకండి. జనాన్ని మిస్‌లీడ్‌ చేయకండి. అందరు ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు. మేం మూడు నెలలుగా కలుసుకోలేదు. అందుకే హోటల్‌లో సమావేశం అయ్యాం’ అని పైలెట్‌ చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ వారందరినీ రిసార్టుకు తరలించిందని వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

రాజస్థాన్‌లో ఈ నెల 19న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒక్కో కేండిడేట్‌కు 51 మొదటి ప్రాధాన్యత ఓట్లు కావాలి. కాగా.. కాంగ్రెస్‌కు తమ పార్టీ ఎమ్మెల్యేలు, బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిపి 103 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు, మరో ఆరుగురి ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయినప్పటికీ బీజేపీ ఇద్దరు కేండిడేట్లను బరిలోకి దింపింది. దీంతో వారిని గెలుచుకునేందుక ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గెహ్లాట్‌ గతంలో ఆరోపణలు చేశారు.