వాషింగ్టన్: అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు అవలంబిస్తున్న చోక్ హోల్డ్ (శ్వాస ఆడకుండా పట్టేసే) పద్ధతిపై బ్యాన్ విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. కానీ ప్రమాదకర సమయంలో అవసరం అవ్వొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నిందితులను పట్టుకునేందుకు ఉపయోగిస్తున్న వివాదాస్పదమైన పద్ధతులను నిషేధించడమే ఉత్తమమని చెప్పారు. చోక్ హోల్డ్ విధానాన్ని నిషేధించేందుకు బలమైన ప్రతిపాదన తీసుకొస్తున్నామని ఆయన అన్నారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు.
అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను ఒక పోలీసు 9 నిమిషాల పాటు మోకాలితో నొక్కిపెట్టడంతో అతను చనిపోయాడు. దీంతో ఆ ఘటనపై పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ విషయంపై మాట్లాడారు. ఫ్లాయిడ్ చనిపోయిన తర్వాత పోలీసుల విధుల్లో మార్పులు తీసుకురావాలని అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ మేరకు 2020 పోలీసింగ్ యాక్ట్‌ను కూడా సవరించనున్నారు. దీనిపై తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అనుమానితుడిని పట్టుకునేందుకు అతడికి ఊపిరి ఆడకుండా చేసి.. మెడపై కాలుపెట్టి నొక్కిపట్టడాన్ని చోక్‌హోల్డ్ అని అంటారు.