బీజింగ్ : చైనాలోని వుహాన్ నుంచి వెలువడిన కరోనా మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచం ఇంకా పోరాడుతుండగా, మరో కొత్త వైరస్ వ్యాప్తి అక్కడి వైద్యులకు నిద్ర లేకుండా చేస్తోంది. చైనా దినపత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ కథనం ప్రకారం, టిక్-కాటు ద్వారా వెళ్లే కొత్త రకం వైరస్ చైనాలో ఉద్భవించింది. ఎస్ఎఫ్టీఎస్(సివియర్ ఫీవర్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) వైరస్ గా పిలుస్తున్న దీనివల్ల ఇప్పటికే కనీసం ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు. దాదాపు 60 మందికి పైగా ఈ కొత్త వైరస్ వ్యాధి బారిన పడ్డారని నివేదిక పేర్కొంది. ఈ వైరస్ పందుల ద్వారా వ్యాప్తి అవుతోందని ఒక ప్రాథమిక అంచనా కొచ్చారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లో 37కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ 2010లోనే చైనాలో ఉనికిలోకి వచ్చిందని ఆ తర్వాత జపాన్, కొరియాల్లోనూ ఈ తరహా కేసులు వెలుగు చూసినట్లు కొందరు సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఇది సోకిన వారిలో జ్వరం, దగ్గు లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. మరణాలరేటు 10నుంచి 16శాతంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇది కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుందని మనుషుల నుంచి మనుషులకు వచ్చే అస్కారం లేదని చెప్పుకొచ్చారు.