మాస్కో: సరిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న దుందుడుకు వైఖరి వల్లే ఇరు దేశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని భారత్ ఆరోపించింది. ఈ మేరకు రెండు దేశాల రక్షణ శాఖ మంత్రులు పాల్గొన్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో.. చైనా తీరును భారత్ ఎండగట్టినట్టు తెలుస్తోంది. సరిహద్దుల వద్ద చైనా ప్రదర్శిస్తున్న వైఖరిపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు అధికారిక వర్గాల సమాచారం. రెండు గంటల 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో గాల్వాన్ వ్యాలీ, పాంగాంగ్ సో సరస్సు వద్ద చైనా దురాక్రమణపై భారత్ నిలదీసింది. దాంతోపాటే సరిహద్దుల వెంబడి ఉన్న చైనా బలగాలను తక్షణమే అక్కడి నుంచి ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. బలగాలను తొలగించి అంతకుముందు ఉన్న ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరింది. ప్రస్తుతం నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం సమసిపోవాలంటే ఇరుదేశాల మధ్య చర్చలే పరిష్కార మార్గమని భారత్ సూచించినట్టు తెలుస్తున్నది. ఇదిలాఉండగా ఇదే సమావేశంలో చైనా రక్షణ శాఖ మంత్రి పెంఘె మాట్లాడుతూ.. తమ భూభాగానికి సంబంధించి ఒక్క ఇంచు కూడా వదులుకోబోమని ఆయన స్పష్టం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి
- September 5, 2020
- Archive
- Top News
- జాతీయం
- CHINA
- DEFENCE MINISTER
- INDIA
- MASCO
- RUSSIA
- చైనా
- భారత్
- రక్షణమంత్రి
- రష్యా
- రాజ్‌నాథ్‌సింగ్
- Comments Off on చైనాపై రాజ్‌నాథ్‌సింగ్ నిప్పులు..