Breaking News

కరోనాతో చెదిరిన చేనేత పరిశ్రమ

  • ఉపాధి కోసం కూలి పనులకు వెళ్తున్న కార్మికులు
  • చేతులు మొద్దు బారి నేత పని చేయలేకపోతున్నామని ఆవేదన
  • ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు కల్పించాలని వేడుకోలు

సారథి న్యూస్​, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి గ్రామం పేరు చెబితేనే చేనేత గుర్తుకొస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నేత పనికి గుర్తింపు తెచ్చిన వాటిలో ఈ గ్రామం కూడా ఒకటి. అలాంటి ఊరులో చేనేత వృత్తే కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృత్తినే నమ్ముకుని కొన్నేళ్లుగా జీవనం చేస్తున్న వారి కుటుంబాల్లో కరోనా అల్లకల్లోలం లేపింది. ఎక్కడో నుంచో వచ్చిన మహమ్మారి జీవితాల్లో చీకట్లు నింపింది. బతుకుజీవుడా! అని తమ వృత్తిని వదులుకుని పొట్టకూటి కోసం ఉపాధి పనులకు, వ్యవసాయ కూలీ పనులు చేయడంలో తలమునకలవుతున్నారు. కూలి పనులతో చేతులు మొద్దుబారి పట్టుదారం చేతికి చిక్కడం లేదని, దారం పట్టు తప్పుతుండడంతో చీరలు నేయలేకపోతున్నామని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దెబ్బతీసిన కరోనా
కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు చేనేత పరిశ్రమనూ దెబ్బతీసింది. నేత కార్మికుల జీవనాధారాన్ని అతలాకుతలం చేసింది. ఈ పరిస్థితుల్లో కొందరు మొగ్గం పనిముట్లను, పరికరాలను అమ్ముకుని, పండ్లు, కూరగాయల వ్యాపారాలు చేసుకుంటున్నారు. చాలా కాలంగా నేత పని మాత్రమే వచ్చిన కొందరు కూలికి వెళ్లలేక కూల్‌డ్రింక్‌ షాపులు, హోటళ్లలో పనిచేసుకుని బతుకుబండిని లాగిస్తున్నారు. వారిని ప్రభుత్వం గుర్తించి చేనేత కార్మికులకు ప్రత్యేకంగా నెలసరి వేతనం ఇవ్వాలని, లేదా 50 ఏళ్లు పైబడిన అన్ని కుటుంబాలకు ఆసరా పింఛన్ కల్పించాలని డిమాండ్​ చేస్తున్నారు. మధ్యవర్తులు చేనేతను కేవలం వ్యాపారంగా మాత్రమే చూశారని, కళగా గుర్తించి ప్రోత్సహించలేదని వారు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్కెటింగ్‌ అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం, చీరల కొనుగోళ్లు సాగకపోవడంతో దళారులు చేతులెత్తేశారని ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వం చొరవ తీసుకుని, చేనేత కార్మికులు తయారుచేసిన పట్టుచీరలను ఆప్కో ద్వారా గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. డిమాండ్​ ఉన్న రాష్ర్టాలకు ఎగుమతి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి నేత కార్మికుడి కుటుంబానికి 50 శాతం సబ్సిడీతో వడ్డీలేని రుణం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కూరగాయల వ్యాపారం చేస్తున్న
చిన్నప్పటి నుంచి నేత పని చేస్తున్న. ఇప్పుడు ఉపాధి లేక మొగ్గం పనిముట్లను అమ్ముకుని కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న. ప్రభుత్వం స్పందించి కార్మికుల వద్ద నిల్వ ఉండిపోయిన పట్టు చీరలను కొనుగోలు చేయాలి. అప్పుడే నేతన్నల మనుగడ సాధ్యమవుతది. మూడు పూటలా కడుపు నింపుకునేందుకు ఈ కూరగాయల వ్యాపారమే దిక్కయింది.
– వెంకటేష్‌, రాజోలి చేనేత కార్మికుడు

కూల్‌ డ్రింక్స్‌ షాపులో పనిచేస్తున్న
మా కుటుంబానికి తెలిసింది పట్టుచీరల తయారీ మాత్రమే. ప్రస్తుతం కరోనా కారణంగా పని దొరుకుతలేదు. ఇటు వృత్తిని వదులుకోలేక, అటు కూలిపనికి వెళ్లలేక కూల్‌డ్రింక్‌ షాపులో పనిచేస్తున్నా. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకపోతే బతకడమే కష్టం. కుటుంబాన్ని భారంగా నెట్టుకుంటూ రోజుకు రూ.200కు కూల్ డ్రింక్ షాపులో పనికి కుదిరిన.
– వీరేష్‌, చేనేత కార్మికుడు, రాజోలి

ఇక చావే దిక్కువుతుంది
నమ్ముకున్న వృత్తి మూడేళ్లుగా కష్టంగా మారింది. చేసిన పనికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో కుటుంబపోషణ భారమైంది. దీనికితోడు కరోనా వైరస్ తాకిడికి మా చేనేత కార్మికులంతా రోడ్డునపడ్డారు. మున్ముందు చేనేత కార్మికులు, వృత్తి కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భవిష్యత్​లో ఫలనా రాజోలిలో చేనేత కార్మికులు ఉండేవారని చరిత్ర చెప్పుకోవడానికే పనికొస్తుంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే చావే దిక్కువుతుంది.
– మధు, చేనేత కార్మికుడు, రాజోలి