- 14 రోజులు.. 12 లక్షల కేసులు.. 15వేల చావులు
- భారత్లో కరోనా ఉగ్రరూపం.. మరణాలు 79 వేలు
- 48 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ : రోజులు గడుస్తున్న కొద్దీ భారత్లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రపంచ దేశాలను దాటుకుని రెండోస్థానానికి ఎగబాకిన భారత్.. రోజూవారీ కేసులు, మరణాలలోనూ ముందే ఉండడం ఆందోళనకరమైన అంశం. గత 50రోజులుగా వైరస్ వ్యాప్తి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన (సోమవారం ఉదయం 10 గంటల నాటికి) గణాంకాల ప్రకారం ఈనెల 14 రోజుల్లోనే 12,52,599 కరోనా కేసులు నమోదవడం గమనార్హం. వరుసగా ఐదు రోజులుగా దేశంలో సుమారు కోవిడ్-19 సోకినవారి సంఖ్య లక్షకు చేరువవుతున్న విషయం తెలిసిందే. రికవరీ రేటు పెరుగుతున్నా.. మరణాలు కూడా నానాటికీ ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో నమోదైన 92,071 కేసులతో కలిపి భారత్లో ఇప్పటివరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 48 లక్షలు (48,46,428) దాటింది. ఇదిలాఉండగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారి (1,136) తో కలిపి ఇప్పటిదాకా 79,722 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొత్త రికార్డులు..
భారత్లో కరోనా సృష్టిస్తున్న విలయతాండవానికి ప్రపంచవ్యాప్తంగా మనదేశం కోలుకోని కొత్త రికార్డులను నమోదుచేస్తోంది. ఆగస్టు నెలలో 19.8 లక్షలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కనెలలో ఏ దేశంలోనూ ఇన్ని కేసులు రాలేదు. ఇక ఈనెలలో ఇప్పటికే 12 లక్షలు మందికిపైగా దీని బారినపడడం.. కొద్దిరోజులుగా దేశంలో రోజుకు లక్ష కేసులు వస్తుండడం.. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే గతనెలలో నమోదైన (19 లక్షలు) గణాంకాలను ఈనెల 20 నాటికే దాటేస్తామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరణాలు ఆందోళనకరం
దేశంలో కరోనా ప్రబలినా.. దాన్నుంచి కోలుకుంటున్నవారు ఎక్కువగానే ఉన్నారు. అయితే అదే సమయంలో మరణాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్లో ఈ నెలలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం మరణాలు 15,332. కరోనా మరణాల్లో ఇది కూడా మనం కోరుకోని రికార్డే. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న యూఎస్, బ్రెజిల్లో కలిపి ఈనెలలో ఇప్పటిదాకా 11వేల మంది మరణించారు. ఇక భారత్లో గత పదిరోజులుగా రోజుకు వెయ్యి మందికిపైగా కరోనా మృతులవుతున్నారు.