సారథి న్యూస్, అనంతపురం: బీఎస్-3 వెహికిల్స్‌ను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించారన్న అభియోగాలపై అరెస్టయిన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్‌రెడ్డిని పోలీసులు తాజాగా కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు, నలుగురు సిబ్బంది శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రభాకర్‌రెడ్డి ఇంటి తలుపు తట్టి వారిపై ఉన్న అభియోగాలను కుటుంబీకులకు వివరిస్తూ వెంట తీసుకెళ్లారు. రోడ్డుమార్గంలో అనంతపురం వన్ టౌన్ పోలీసుస్టేషన్‌కు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. సాయంత్రం జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా ఇద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించి రెడ్డిపల్లిలోని జిల్లా జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు. అయితే రెడ్డిపల్లి జైలులో ఓ ఖైదీకి కరోనా అనుమానిత లక్షణాలు వెలుగు చూడడంతో వారిద్దరికి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లగా తాడిపత్రి జైలుకు తరలించాలని సూచించారు. అయితే అక్కడికి తీసుకెళ్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో అర్ధరాత్రి తర్వాత వారిద్దరినీ కడప జైలుకు తరలించారు.
- June 14, 2020
- Top News
- అనంతపురం
- ఆంధ్రప్రదేశ్
- JC PRABHAKAR
- KADAPA
- కడప జైలు
- జేసీ ప్రభాకర్‌రెడ్డి
- Comments Off on కడప జైలుకు జేసీ సోదరుడు