Breaking News

ఎందుకీ హైడ్రామా?

ఎందుకీ హైడ్రామా?

సారథి న్యూస్, హైదరాబాద్​: 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 21కోట్ల మంది క‌రోనాబారిన ప‌డ‌తార‌ని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2020 ఆగ‌స్టు 15కు క‌రోనా వ్యాక్సిన్ తెస్తామంటోంది భార‌త ప్రభుత్వం. గాలి ద్వారా కూడా వైర‌స్ వ్యాపించేందుకు అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేమంటుంది ప్రపంచ ఆరోగ్యసంస్థ. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఏపీ స‌ర్కారు రోజురోజుకూ వైద్యపరీక్షలు పెంచుతోంది. ఇప్పటికే దాదాపు 10 లక్షల మందిని ప‌రీక్షించింది. మ‌రి.. తెలంగాణ‌లో 28వేల మందికి వైర‌స్​ సోకింది. 16వేల మంది డిశ్చార్జ్​అయ్యారు. 12వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 313 మంది మ‌ర‌ణించారు. వీరిలో జర్నలిస్టు మ‌నోజ్‌, తాజాగా ప్రజాగాయ‌కుడు నిస్సార్ కూడా ఉన్నారు. కొద్దిరోజులుగా ప్రగతిభవన్​ చుట్టూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు ప్రచారం జరుగుతున్నాయి.
మొన్న ఓ ప‌త్రిక‌లో కేసీఆర్ కు పాజిటివ్ అంటూ వార్త రాయ‌డంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. అస‌లు కేసీఆర్ ఎక్కడ.. ఎలా ఉన్నార‌నే అంశంపై మంత్రులు అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

విమర్శల పర్వం

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా క‌రోనా విష‌యంలో కేసీఆర్ దొంగాట ఆడుతున్నారంటూ దుయ్యబట్టారు. ఎంఐఎంకు భ‌య‌ప‌డి తెలంగాణ‌లో క‌రోనా ప‌రీక్షలు చేయ‌ట్లేదంటూ బీజేపీ ఘాటుగా వ్యాఖ్యానించింది. కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి బ‌హిరంగ స‌మావేశంలోనే కేసీఆర్ వైఖ‌రిని విమర్శించారు. ఇప్పటికే వ‌ల‌స కూలీలు ప‌నుల్లేక‌పోయినా ప‌స్తులు ఉండేందుకు ఇష్టపడి సొంతూళ్లకు చేరారు. హైద‌రాబాద్‌లో పెరుగుతున్న కేసుల‌తో ఇక్కడి చిరుద్యోగులు, వ్యాపారులు, ఉపాధి కోసం వ‌చ్చిన ల‌క్షలాది మంది స్వస్థలాలకు ప్రయాణం క‌ట్టారు. గ‌తంలో ఎన్నడూ లేనంత‌గా హైద‌రాబాద్ ఖాళీ అవుతుంది. మున్ముందు వైర‌స్ మ‌రింత వ్యాపిస్తుంద‌నే ఆందోళ‌న ఉన్నా ప్రభుత్వం మెత‌క‌వైఖ‌రి అవ‌లంభించ‌డాన్ని విప‌క్షాల‌తోపాటు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అయినా.. పాల‌కుల తీరు మార‌ట్లేదు. ఇప్పటికే హైద‌రాబాద్‌లో క‌రోనా సోకిన రోగుల‌కు మంత్రులు, ఉన్నతాధికారుల సిఫార్సుల‌తో బెడ్‌లు వెతుక్కోవాల్సి వ‌స్తుంది. మ‌రి సామాన్యుల ప‌రిస్థితి.. గాంధీ, నేచుర్ క్యూర్‌, ఆయుర్వేద‌, చెస్ట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిందే. అక్కడా వైద్యులు శాయ‌శ‌క్తులా ప్రాణాలు కాపాడేందుకు శ్రమిస్తున్నారు. అయినా.. ఇప్పటికే 313 మంది శ్వాస ఆడ‌క‌.. వైద్యం అంద‌క‌.. మ‌ర‌ణించారు.