ఓ అమ్మాయి చెట్లు, గోడలు ఎక్కుతుందంటే.. చుట్టూ ఉన్న జనం అదో తప్పుగా, వింతగా చూస్తుంటారు. ‘ఆ పిల్ల మగరాయుడిలా చెట్టు ఎక్కుతుంటే.. వాళ్ల అమ్మానాన్నలైనా బుద్ధి చెప్పొందా?’ అంటూ నలుగురూ ఆడిపోసుకుంటారు. ఇలాంటి నలుగురి నోళ్లే కాదు.. వందమంది అంటున్నా పట్టించుకోకుండా కుటుంబపోషణ కోసం కొబ్బరి చెట్లు ఎక్కుతోంది 25 ఏళ్ల శ్రీదేవి గోపాలన్..
తండ్రి సంపాదనతో పోషణ
శ్రీదేవి కుటుంబం కేరళలోని మలప్పురం గ్రామంలో ఉంటోంది. ఆమె తండ్రి గోపాలన్కొబ్బరి చెట్లు ఎక్కితే వచ్చే డబ్బుతో ముగ్గురు ఆడపిల్లలను చదివిస్తున్నాడు. వచ్చే ఆదాయం ఇంటి పోషణ. పిల్లల చదువుకు సరిపడకపోవడంతో ఎప్పుడూ ఇబ్బంది పడేవాడు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న పెద్దకూతురు శ్రీదేవి.. తండ్రి మాదిరిగానే కొబ్బరి చెట్లు ఎక్కడం నేర్చుకుంది. లాక్డౌన్ కారణంగా ఎలాగూ కాలేజీలు తెరవట్లేదు. అందుకే ఇలా తండ్రికి ఆర్థికంగా చేదోడుపాదోడుగా ఉండేందుకు సిద్ధపడింది.
పెద్దకొడుకులా మారి..
లాక్డౌన్ కారణంగా అందరిలాగే గోపాలన్కుటుంబం కూడా ఆర్థికంగా బాగా దెబ్బతిన్నది. ‘మనకు ఒక కొడుకు ఉంటే, నాకు కొబ్బరి చెట్లు ఎక్కే పనిలో సాయంగా ఉండేవాడు కదా’ అని గోపాలన్ ఒకరోజు తన భార్యతో అనడం శ్రీదేవి చెవిన పడింది. తండ్రికి ఎంత కష్టంగా ఉంటే ఆ మాట అని ఉంటాడని ఆలోచించింది. అప్పుడే ‘తానెందుకు కొబ్బరి చెట్టు ఎక్కకూడదు’ అనుకుంది. యూ ట్యూబ్లో వీడియోలు, ట్యూటోరియల్ క్లాసులు చూసి కొబ్బరి చెట్లు ఎక్కడంలో టెక్నిక్స్ తెలుసుకుంది. ఇంట్లో వాళ్లకు తన నిర్ణయం చెప్పగానే.. సమాజం ఏమనుకుంటుందని వద్దన్నారు. చివరికి శ్రీదేవి ఎలాగోలా ఇంట్లో వాళ్లను ఒప్పించి తండ్రి సాయంతో చెట్టు ఎక్కడం.. ఎలాంటి కొబ్బరి కాయలి? ఏది పండు? ఏది కాయ? అన్న విషయాలను నేర్చుకుంది. కేవలం రెండే నెలల్లో తండ్రి పని నేర్చుకుని కుటుంబానికి తనవంతు సంపాదన అందిస్తోంది.
ఇరుగుపొరుగు.. వెక్కిరించినా
శ్రీదేవి చెట్లు ఎక్కడం నేర్చుకుంటుందన్న విషయం మెల్లగా ఊరంతా పాకింది. దాంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా అవమానించడం మొదలుపెట్టారు. ‘నువ్వు ఇంత కష్టపడి చదివిస్తున్నది ఈ చెట్లు ఎక్కించడానికేనా?’, ‘ఇలా ఒక అమ్మాయి కొబ్బరి చెట్టు ఎక్కే పని చేస్తుందంటే, ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు?’, ‘ఆ పిల్లకు బుద్ధి లేదు.. తల్లిదండ్రులుగా మీరైనా చెప్పాలిగా’ వంటి సూటిపోటి మాటలతో ఆ కుటుంబాన్ని మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేశారు ఊరుజనం. కానీ కూతురి ఆత్మవిశ్వాసం చూసి గోపాలన్వెనక్కి తగ్గలేదు.
టీచర్ అవ్వాలన్నదే ధ్యేయం
ఎప్పటికైనా టీచర్అవ్వాలన్నదే శ్రీదేవి గోల్. హిస్టరీలో పీజీ చదివింది. ప్రస్తుతం బీఎడ్ఫైనల్ఎగ్జామ్స్కు ప్రిపేర్అవుతోంది. ఈ కరోనా, లాక్డౌన్కారణంగా పరీక్షలు ఆగిపోయాయి. అందుకే ఈ ఖాళీ సమయంలో కొబ్బరి చెట్లు ఎక్కి కుటుంబ బాధ్యతను ఒంటరిగా మోస్తున్న తండ్రికి తోడుగా ఉండాలనుకుంది. కొబ్బరి చెట్లు ఎక్కాలనుకుంటున్న విషయాన్ని ఆమె మొదట ఇద్దరు చెల్లెళ్లతో షేర్చేసుకుంది. వాళ్లు ఇచ్చిన ఐడియాతో ఆన్లైన్లో చెట్లు ఎక్కేటప్పుడు గ్రిప్ఇచ్చే మెషీన్గురించి తెలుసుకుంది. అది వాళ్ల నాన్నకు కూడా ఉపయోగపడుతుందని ఆర్డర్చేసింది. అలాగే ఆ కుటుంబానికి కారు కొనే స్తోమత లేదు. అందుకే అటూఇటూ వెళ్లడానికి, ఆర్థికంగా కొంత ఆదాయం పెరగడానికి కొన్నిరోజుల క్రితం ఆటో తీసుకున్నారు. ఈ లాక్డౌన్టైమ్లో శ్రీదేవి ఆటో నడపడం కూడా నేర్చుకుంది.
అల్టిమేట్గోల్ టీచర్
‘ఏదైనా చేయాలని అనిపిస్తే, దాన్ని ఎంత కష్టమైనా వదలొద్దు. కొబ్బరి చెట్లు ఎక్కడం నేర్చుకుంటుంటేనే నాన్న కష్టం బాగా అర్థమైంది. నా ఇద్దరి చెల్లెళ్లకు కూడా టెక్నిక్స్నేర్చిస్తున్నా. ఆడపిల్లలు చేయలేని పనులంటూ ఉండవని నిరూపించాలనుకుంటున్నా. ఈ లాక్డౌన్నాకు ఎన్నో కొత్త పాఠాలను నేర్పింది. పని మాత్రమే కాదు.. సమాజంలో అమ్మాయిల విషయంలో ఉన్న వివక్షను కళ్లారా చూశాను. ఆటో నడపడం కూడా నేర్చుకున్నా కాబట్టి రేపు లైసెన్స్వచ్చాక అది కూడా నడుపుతా. నా అల్టిమేట్గోల్ టీచర్ అవ్వాలని. రేపటి తరంలోనైనా ఆడపిల్లలపై ఎలాంటి వివక్షకు తావులేకుండా చేయడానికి నా వంతుగా కృషి చేస్తా. ఆ దిశగా నా విద్యార్థులకు పాఠాలు చెప్పాలనుకుంటున్నానని’ చెబుతోంది శ్రీదేవి.
పట్టుదల ఎక్కువ
శ్రీదేవి అందరిలాంటి అమ్మాయి కాదు.. ఏదైనా అనుకున్నదంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టదు. తనకు పట్టుదల, కష్టపడేతత్వం ఎక్కువ, చిన్నప్పట్నించి మా ఫ్రెండ్స్ అందరిలో శ్రీదేవికి చాలా ధైర్యం. కొబ్బరి చెట్లు ఎక్కుతుందని తెలిసినప్పుడే నేను అనుకున్నా.. ఎవరేమన్నా తాను పట్టించుకోదు.
:: అశ్వతి నయ్యర్, శ్రీదేవి ఫ్రెండ్
తండ్రి కష్టం చూడలేక
ఇంట్లో పెద్ద కూతుర్ని కావడం వల్ల నాకు అమ్మానాన్నల కష్టం అర్థమయ్యేది. వాళ్లెప్పుడూ మా స్కూలు, కాలేజీల ఫీజుల గురించి మాట్లాడుకుంటూ ఉండడం గమనించేదాన్ని. నాన్నకు వచ్చే కొంత డబ్బుతోనే మాకన్నీ సమకూర్చేవాడు. ఒక్కరి సంపాదనతో ముగ్గురు ఆడపిల్లలను పెంచడం అంత సులవైన పనికాదు. అందుకే నాన్న బాధ్యతను పంచుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఈ లాక్డౌన్నాకు ఆ అవకాశాన్ని అందించింది. ఇప్పుడు మా చుట్టుపక్కల్లో కొత్తగా నాన్న తొమ్మిది చెట్లను పట్టుకున్నాడు. ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. ఒక్క చెట్టు ఎక్కితే రూ.40 ఇస్తారు.
:: శ్రీదేవి గోపాలన్
::: ఎన్ఎన్