ఓ వైపు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం. మరోవైపు పార్టీ గుర్తింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు, ఇంకోపక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై హైకోర్టు వ్యాఖ్యలు. వీటితోనే జగన్ సర్కారు సతమతమవుతుంటే.. ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సీఎంవో మాజీ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీవీ రమేష్ వ్యాఖ్యలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. శుక్రవారం ఆయన ట్వీట్ చేసిన అంశాలు ఏపీలోని రాజకీయ, అధికారవర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదండోయ్.. ఈ ట్వీట్‌ను ఐఏఎస్, ఐపీఎస్‌ల అసోసియేషన్‌కు కూడా ట్యాగ్ చేశారు. దీంతో ఈ ట్వీట్ తీవ్ర సంచలనం రేపింది. ఇటీవల సీఎంవోలో పీవీ రమేష్ నుంచి ప్రభుత్వం అన్ని సబ్జెక్టులను తీసివేసింది. అప్పటినుంచి ఆయన కార్యాలయానికి వెళ్లడం లేదు. అయితే, ఇన్ని రోజులు సీఎం జగన్ పక్కనే ఉండడంతో పాటు సీఎంవో అధికారి హోదాలో విధులు నిర్వహించారు పీవీ రమేష్.
ప్రభుత్వంలోని అనేక వ్యవహారాలను ఆయన దగ్గరుండి చూశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యాఖ్యలను ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారు. ఒకరిద్దరు అధికారులను ఉద్దేశించి చేశారా.. లేక రాష్ట్రంలో ఎక్కువమంది అధికారులు ఇదేవిధంగా ఉన్నారన్న భావనతో చేశారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయితే, ప్రభుత్వంలో ఇప్పటివరకు కీలకంగా పనిచేసిన అధికారే ఈ వ్యాఖ్యలు చేయడంతో వీటిని అంత తేలికగా కొట్టిపారేసే పరిస్థితి లేదని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాన్ని ఎప్పటినుంచో టీడీపీతో పాటు విపక్షాలు చెబుతున్నాయని, ఇప్పుడు ప్రభుత్వంలోని కీలక అధికారే వాటిని బయటపెట్టడంతో విపక్షాల ఆరోపణలు నిజమేనని భావించాల్సి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇటీవల రాష్ట్రంలో సర్కారుకు వ్యతిరేకంగా వరుస పరిణామాలు జరుగుతుండడంతో సర్కారు పెద్దలు, సీఎం జగన్ మోహన్‌రెడ్డి తలలు పట్టుకుంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.