- కొండపోచమ్మ సాగర్ లోకి పంపింగ్ కు రెడీ
- 29న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం
- ఇక మెతుకుసీమకు జలసిరి
సారథి న్యూస్, మెదక్: రైతుల సాగు నీటికష్టాలు దూరం చేసి, లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేసే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలితాలు రైతులకు అందే సమయం ఆసన్నమైంది. భారీ ప్రణాళికతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పరిధి జలాశయాలకు గోదావరి జలాలు చేరుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితమే సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో నిర్మించిన రంగనాయక సాగర్ కు అక్కడి నుంచి మల్లన్నసాగర్ దిగువన నిర్మించిన తుక్కాపుర్ సర్జిపూల్ కు గోదావరి జలాలు చేరాయి. ఆ తర్వాత అక్కడినుంచి మోటార్లతో పంపింగ్ చేసి కాల్వల ద్వారా గజ్వేల్ మండలంలోని అక్కారం వరకు, అక్కడి నుంచి నీటిని మర్కూక్ లోని పంప్ హౌస్ సర్జీపూల్ కు నీటిని పంపింగ్ చేశారు. ఇక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ఎత్తయిన (618 మీటర్ల) కొండ పోచమ్మ సాగర్ కు నీటిని లిఫ్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం ఏడు లింక్ ల్లో నిర్మిస్తుండగా కొండ పోచమ్మ సాగర్ నాలుగవ లింక్ లో ఉంది. గోదావరి నదిపై లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) నుంచి వివిధ దశల ఎత్తిపోతల(లిఫ్టుల) ద్వారా తరలించే నీరు కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి 162 కి.మీ. దూరం ప్రయాణించి కొండపోచమ్మ సాగర్ లోకి చేరుతాయి. 15 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా కరువు ప్రాంతాలకు నీరు చేరుతుంది. ఈ రిజర్వాయర్ ద్వారా గజ్వేల్ నియోజక వర్గ పరిధిలో 70వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
మెతుకుసీమకు జలసిరి
కొండపోచమ్మ సాగర్ నుంచి మెదక్ జిల్లాకు గోదావరి జలాలు తరలించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి వర్గల్ మండలంలో ప్రారంభమయ్యే హల్దీ వాగుకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నీరు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని హకీంపేట వద్ద నిర్మితమైన హాల్ది ప్రాజెక్టులోకి చేరుతాయి. అక్కడి నుంచి వదిలితే మెదక్ మండలంలోని బొల్లారం మత్తడి మీదుగా ప్రవహించి పుష్పాల వాగు, పసుపులేటి వాగు మీదుగా మెదక్ పట్టణ శివారులో మంజీరా నదిలో కలుస్తాయి. తద్వారా మెదక్, హవేలీ ఘన్ పూర్ మండలాల పరిధిలో మాహబూబ్ నహర్ కాల్వ కింద 10వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు హాల్డి ప్రాజెక్ట్, పరివాహక ప్రాంతంలో, పుష్పాల, పసుపులేరు వాగు పరివాహక ప్రాతంలో, మంజీరా నదిమీద కోటగా నిర్మించిన చెక్ డ్యామ్ ల పరిధిలో వేలాది ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంది.
ఆ పేర్లు ఎందుకంటే..
అత్యధిక ఎత్తులో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కు కొండపోచమ్మ పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులో కొండపోచమ్మ ఆలయం ఉంటుంది. దాని సమీపంలోనే కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం (మల్లన్న గుడి) ఉంది. రెండు దేవాలయాలకు ఎంతో విశిష్టత ఉంది. ఒక గుడికి వచ్చిన భక్తులు మరో గుడికి వెళ్లే సంప్రదాయం ఉంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించే అతిపెద్ద రిజర్వాయర్ కు మల్లన్న సాగర్ అని, అత్యధిక ఎత్తులో నిర్మించే రిజర్వాయర్ కు కొండ పోచమ్మ సాగర్ అని సీఎం కేసీఆర్ నామకరణం చేశారు.
కొండ పోచమ్మను ఈ ప్రాంతంలో లక్షలాది ఇంటిదేవతగా కొలుస్తారు. నిత్యం వచ్చి పూజలు చేస్తారు. తమను చల్లగా చూసే దేవతగా పేరుంది. కొండపోచమ్మ సాగర్ కూడా ఈ ప్రాంత వ్యవసాయం, తాగునీరు, ఇతర అవసరాలు కూడా తీర్చేలా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అమ్మవారి పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టును ఓ దేవాలయం మాదిరిగా భావిస్తున్న కేసీఆర్, అందుకు అనుగుణంగానే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
యాగాలు.. హోమాలు.. విశేషపూజలు
సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మించడంతో మర్కూ క్ నుంచి పంపింగ్ ద్వారా కొండపోచమ్మ సాగర్ లోకి గోదావరి జలాలు లిఫ్ట్ చేయడాన్ని స్వయంగా సీఎం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఈనెల 29న ఉదయం 11:30 గంటలకు ముహూర్తం కుదిరింది. సీఎంతో పాటు త్రిదండి చిన్నజీయర్ స్వామి కూడా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు . ఈ సందర్భంగా చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మ పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 29వ తేదీ ఉదయం 4 గంటలకు ఏకకాలంలో కొండపోచమ్మ ఆలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్ పంపుహౌస్ (మర్కూక్) వద్ద సుదర్శన యాగం ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు సీఎం కేసీఆర్ దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కి.మీ. దూరంలో ఉండే కొండ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేకపూజలు చేస్తారు.
చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొంటారు. తీర్థప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్కూక్ వద్ద గల కొండ పోచమ్మ సాగర్ కు నీటిని లిఫ్టు చేసే పంపు హౌస్ వద్దకు చేరుకుంటారు. 10 గంటల సమయంలో పంపుహౌస్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం పంపుహౌస్ స్విచ్చాన్ చేస్తారు. అక్కడి నుంచి ప్రాజెక్టు డిశ్చార్జ్ కెనాల్(నీరు చేరుకునే ప్రాంతం) వద్దకు వచ్చి గోదావరి జలాలకు స్వాగతం పలికి, గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు.