- తమకు ఎదురులేదనే ధీమాతో టీఆర్‌ఎస్
- ‘ట్రబుల్ షూటర్’ దుబ్బాక బాధ్యతలు
- తీర్మానాల వ్యూహానికి మరింత పదును
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం డాక్టర్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి నేటి దాకా ఉపఎన్నికల పార్టీగా టీఆర్‌ఎస్ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటోంది. ఆయా ఎన్నికల్లో భారీ మెజారిటీలే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోవడం దానికి ఆనవాయితీ. అది పార్లమెంట్ సీటైనా, అసెంబ్లీ స్థానమైనా.. పక్కా ప్లాన్ ప్రకారం సమావేశాలు, సభలు నిర్వహించడం ద్వారా ఓటర్లను కొన్ని నెలల ముందే కలవడం, వారిని ప్రసన్నం చేసుకోవడం గులాబీ నేతలకు రివాజు. ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే స్థానం, హైదరాబాద్ నగరంలోనూ ఇదే సీన్ రిపీటవుతోంది.
సారథి న్యూస్, హైదరాబాద్: ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాకలో ఉపఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. నవంబరు 3న అక్కడ ఎలక్షన్ నిర్వహిస్తామని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడడానికి నెలరోజుల ముందు నుంచే గులాబీ పార్టీ తన వ్యూహానికి పదును పెట్టింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రులు టి.హరీశ్‌రావు, కె.తారకరామారావు నియోజకవర్గాలకు మధ్యలో దుబ్బాక ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో అక్కడి ఉపఎన్నికను టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు… ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గాన్ని ఆసాంతం ఒకసారి చుట్టేశారు. అక్కడ లక్ష మెజారిటీ సాధించాలంటూ సీఎం కేసీఆర్ దిశా, నిర్దేశం చేసిన నేపథ్యంలో… అసెంబ్లీ సమావేశాల ముందూ, ఆ తర్వాతా ఆయన అక్కడే మకాం వేశారు. రేయింబవళ్లూ నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇప్పటికే వివిధ కుల, సామాజిక సంఘాల ప్రతినిధులతో పలుమార్లు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఊరూరా తిరుగుతున్నారు. ఇందుకోసం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ఆయన వేదికగా చేసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమం నుంచి అనుసరిస్తున్న ‘తీర్మానాల’ వ్యూహాన్ని హరీశ్‌రావు పక్కాగా అమలుచేస్తున్నారు. గ్రామాలు, మండలాలు, కుల, మత సంఘాల వారీగా ‘తామంతా టీఆర్‌ఎస్ వైపే…’ అనే విధంగా తీర్మానాలు చేయిస్తూ ముందుకు పోతున్నారు. తద్వారా ప్రతిపక్ష పార్టీలను డైలమాలో పడేయాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలను ఇన్‌చార్జ్‌లుగా నియమించడం ద్వారా… క్షేత్రస్థాయిలోని ఏ ఒక్క ఓటూ పక్కకు పోకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.
‘గ్రేటర్ వార్’పై నజర్
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి… మంత్రి కేటీఆర్, తనదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. దాదాపు మూడు నాలుగు నెలల నుంచే ఆయన ఈ పనిలో నిమగమైపోయారు. ముఖ్యంగా ఎంఐఎంతో దోస్తీకి సంబంధించి, ఆ పార్టీ నేతలతో వరుసగా భేటీలు నిర్వహించడం, హోంమంత్రి మహమూద్ అలీతోపాటు నగరానికి చెందిన ఇతర మంత్రులతో సమాలోచనలు చేయడం, తాజాగా అసెంబ్లీలో హైదరాబాద్ నగర అభివృద్ధిపై చర్చించడం ద్వారా ఇతర పార్టీల కంటే ముందే జీహెచ్‌ఎంసీ ఎన్నికల శంఖారావాన్ని పూరించడంలోనూ ఆయన సఫలీకృతుడయ్యారని చెప్పొచ్చు. టీ.హబ్ ద్వారా హైదరాబాద్ నగరానికి ఐటీ కంపెనీలు, టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలను తీసుకొచ్చామంటూ పదే పదే ప్రకటించడం కూడా ఎన్నికల వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యూహాలతో పాటు సందేహాలు
దుబ్బాక ఎన్నికల్లో భారీ మెజారిటీని సాధించడం, జీహెచ్‌ఎంసీలో అత్యధిక డివిజన్లను కైవసం చేసుకోవడం ద్వారా మున్ముందు జరగబోయే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎలక్షన్లను ప్రభావితం చేయాలన్నది టీఆర్‌ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఆ పార్టీ వ్యూహాలు, ప్రణాళికలు బాగానే ఉన్నా కొన్ని తలనొప్పులు కూడా తప్పేలా లేవు. ముఖ్యంగా దుబ్బాకలో మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి… ఎమ్మెల్యే టిక్కెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. ‘సీఎం గారు మా నాన్నకు మాటిచ్చారు. కచ్చితంగా నాకే టిక్కెట్ వచ్చి తీరుతుంది. ముత్యంరెడ్డి ఆశయాలను నెరవేర్చాలంటే ఆయన కొడుకే ఎమ్మెల్యే కావాలని ప్రజలు కోరుకుంటున్నరు…’ అంటూ మంగళవారం ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి దుబ్బాక టిక్కెట్‌పై శ్రీనివాసరెడ్డి వైఖరేంటో స్పష్టమవుతున్నది ఒకవేళ అధికార పార్టీ టిక్కెట్ నిరాకరిస్తే… ఆయన ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తారనే ప్రచారం కూడా కొనసాగుతుండడం గమనార్హం. కానీ వాస్తవ పరిస్థితి మరో రకంగా ఉంది. సోలిపేట రామలింగారెడ్డి సతీమణి లేదా కుమారుడికే టిక్కెట్ దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి ఏం చేస్తారనేది వేచి చూడాలి.
‘ట్రబుల్ షూటర్’ అధిగమిస్తారా?
జీహెచ్‌ఎంసీ విషయానికొస్తే… కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజలు, నిరుద్యోగులు, కొలువులు పోయిన ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రైవేట్ రంగాల్లో పనిచేసే కార్మికులు, సిబ్బంది అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. దీంతో ప్రజలు తీవ్రఇబ్బందులు పడ్డారు. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయనే ఆందోళన కూడా టీఆర్‌ఎస్‌లో లేకపోలేదు. ఇలాంటి సమస్యలను ట్రబుల్ షూటర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా అధిగమిస్తారనేది వేచి చూడాల్సిన అంశంగా మారింది.