Breaking News

వర్క్‌ ఫ్రమ్‌ హోం

వర్క్‌ ఫ్రమ్‌ హోం
  • కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వెసులుబాటు
  • 50శాతం మంది ఇంటినుంచి పనిచేసేలా అనుమతి
  • వీడియో కాన్ఫరెన్స్​ల నిర్వహణకు ప్రాధాన్యం
  • కరోనా, ఒమిక్రాన్​వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం
  • ఖరగ్ పూర్​ఐఐటీలో 60 మందికి కరోనా
  • ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కొవిడ్​పాజిటివ్​

న్యూఢిల్లీ/చండీగఢ్: దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అండర్‌ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50శాతం మంది ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గర్భిణులు, దివ్యాంగులు కార్యాలయాలకు రావడంపై మినహాయింపు ఇచ్చింది. అదే సమయంలో సిబ్బంది ఆఫీసుకు వచ్చేందుకు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు రెండు సమయాలను నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు వచ్చినవారు సాయంత్రం 5.30 గంటలకు, మార్నింగ్​10గంటలకు  వచ్చినవారు సాయంత్రం 6.30 గంటలకు వెళ్లాలని ఆదేశించింది. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ఉండేవారు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్యాలయాల్లో జరిగే సమావేశాలను వీలైనంత మేరకు వీడియో కాన్ఫరెన్స్​ద్వారా నిర్వహించాలని సూచించింది. పంజాబ్‌లోనూ కొన్నిరోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతుండటంతో పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్​జిత్​సింగ్​చన్నీ ఆధ్వర్యంలో కొవిడ్​పరిస్థితిపై సమీక్ష నిర్వహించి రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. అలాగే విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. అయితే వర్చువల్‌గా తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చింది. మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు మాత్రం యథావిధిగా నడుపుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బార్‌లు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌, రెస్టారెంట్లు, స్పాలు, మ్యూజియంలు, జంతు ప్రదర్శన శాలలు 50శాతం సామర్థ్యంతో పనిచేయొచ్చని ప్రకటించారు. ర్యాలీలు, సమావేశాలపై కూడా ఆంక్షలు విధించారు. పంజాబ్‌లో డిసెంబర్‌ 28న 51 కేసులు నమోదు కాగా.. సోమవారం నాటికి వాటి సంఖ్య 419కి చేరింది.

  • కరోనాబారిన ప్రముఖులు

పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌తో పాటు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే, బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీకి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. వీరంతా హోంఐసోలేషన్​లో ఉండగా ఇటీవల తమను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని వారు ట్విట్టర్​ద్వారా సూచించారు. అయితే ఢిల్లీలో పాజిటీవ్​రేటు 6.46గా ఉంది. గత డిసెంబర్‌ 30,31 తేదీల్లో జినోమ్‌ స్వీక్సెన్సింగ్‌కి పంపగా 81 శాతం ఒమిక్రాన్‌ కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఖరగ్ పూర్ ఐఐటీ క్యాంపస్‌లోనూ కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 60 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా, వారిలో 40మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. మిగతా 20 మంది నాన్ టీచింగ్ స్టాఫ్, పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువ మందికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఏ లక్షణాలు లేని వారు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ రిజిస్ట్రార్ తమల్ నాథ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్​శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 12మంది సిబ్బందికి కరోనా సోకింది. ఉద్యోగులు, వైద్యులకు కరోనా పాజిటివ్​నిర్ధారణ కావడంతో ఈనెల చివరి వారంలో నిర్వహించాల్సిన రీశాట్‌ ఉపగ్రహ ప్రయోగం వాయిదాపడే అవకాశం ఉందని స్థానిక అధికారులు పేర్కొన్నారని వార్తలు వచ్చాయి.