- పార్లమెంట్‌లో అనూహ్యంగా గౌడను ఆహ్వానించిన మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎప్పుడూ హుందాగా ఉంటారు. ఖాళీ సమయంలో.. లేకపోతే వీలైనప్పుడు పలువురు కీలక నేతలను, మేథావులను, ప్రత్యేకమైన వ్యక్తులను కలిసి సంభాషిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో ఫొటోలను షేర్ చేసి తన అనుభవాలను పంచుకుంటుంటారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోడీ తాజాగా మాజీ ప్రధానమంత్రి దేవేగౌడతో భేటీ అయ్యారు. పార్లమెంట్సమావేశాలకు హాజరైన హెచ్‌డీ దేవేగౌడను ప్రధాని మోడీ సాదరంగా ఆహ్వానించి ఆయనతో ముచ్చటించారు. దేవేగౌడతో మంగళవారం భేటీ అయిన ఫొటోలను ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు పలు కీలక విషయాలపై చర్చించినట్లు సమాచారం. కర్ణాటకలో కీలకంగా వ్యవహరిస్తున్న జనతాదళ్ సెక్యులర్ పార్టీ అధినేతతో ప్రధాని మోడీ భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. వ్యవసాయ బిల్లులు, క్రిప్టో కరెన్సీ తదితర అంశాలపై పార్లమెంటులో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ దేవేగౌడతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. తాజా, మాజీ ప్రధాని భేటీపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. 2023లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అదేవిధంగా జేడీఎస్ పార్టీల పొత్తు ఉంటుందేమోనన్న సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. అంతకుముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పోటీచేశాయి. ఈ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దేవేగౌడ కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి సీఎంగా బాధ్యతలు సైతం చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు, కొంతమంది బీజేపీలో చేరడంతో కుమారస్వామి రాజీనామా చేశారు. ఆ తర్వాత కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని చేపట్టింది.