- ప్రశ్నించే గొంతును నొక్కేస్తే ఊరుకునేదే లేదు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
సామాజిక సారథి, సిద్దిపేట: గ్రీన్ ట్రిబ్యునల్ పరిహారం ఇచ్చిన తర్వాతే రిజర్వాయర్ పనులు చేపట్టాలని ఆదేశించినా అవేవి పట్టనట్లు ప్రభుత్వం వ్యవహస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి భూనిర్వాసితులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. భూనిర్వాసితులు దశాబ్దంన్నర కాలంగా పరిహారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, ప్రభుత్వం, అధికారులు పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవెల్లి రిజర్వాయర్ ను తొలుత 1.4 టీఎంసీల సామర్థ్యంతో డిజైన్ చేసి, నాటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టును పరిశీలించి 1.4 నుంచి 8.2 టీఎంసీలకు రీడిజైన్ చేశారన్నారు. దీంతో భూనిర్వాసితులు రెండు సార్లు భూములు కోల్పోయారని గుర్తుచేశారు. పునరావాస ప్యాకేజీ, ఇల్లు అడుగు స్థలాలతో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కింద ఓ రైతు ఐదెకరాల భూమి కోల్పోతే, ఆ రైతుకు ప్రభుత్వం ఇస్తున్న డబ్బును తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో రెండెకరాలు కొనలేని పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వం పోలీసు బలగాలను పెట్టి పనులు చేయించడమే కాకుండా మహిళలను కనీసం చూడకుండా లాఠీచార్జ్చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతును ఏడిపిస్తే ప్రభుత్వానికి ఉసురు తగిలిపోతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూనిర్వాసితులకు డబుల్ బెడ్ రూములు కట్టిస్తానని గతంలో చెప్పారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ వద్దే ఇరిగేషన్ శాఖ ఉందని, భూనిర్వాసితుల సమస్యలపై మాట్లాడుతానని చెప్పారు. సమస్యలపై స్పందించకుంటే నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సర్పంచ్ రాజిరెడ్డి, సీపీఐ అక్కన్నపేట మండల కార్యదర్శి వనేశ్, ఉప సర్పంచ్భాస్కర్, రాజుకుమార్, సుదర్శన్, భూనిర్వాసితులు పాల్గొన్నారు.