Breaking News

బోగస్ బోనఫైడ్ ల దందాపై విచారణ జరిగేనా..?

సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి జిల్లాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా యథేచ్చగా జరుగుతున్న బోగస్ బోనఫైడ్ ల దందా పై ఈ నెల 20న సామాజిక సారథి పత్రికలో ప్రచురించిన కథనం సంచలనంగా మారింది. నిరుపేద తల్లిదండ్రుల అమాయకత్వాన్ని కొందరు గురుకుల కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్న విషయం ఈ కథనంలో వివరంగ రావడంతో ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వహకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. పైసలిస్తే చాలు… స్టూడెంట్ల పుట్టిన తేదిలతో పాటు అడ్రస్ లు మార్చి బోగస్ బోనఫైడ్ లు ఇవ్వడాన్ని పూర్తి వివరాలతో కథనం ప్రచురించడంతో అక్రమార్కులు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు.దీంతో తమ గుట్టు రట్టు అవుందని గ్రహించిన కోచింగ్ సెంటర్ల నిర్వహకులు దిద్దుబాటు చర్యలు షురూ చేశారు. ఒక వేళ అధికారులు తనిఖీలకు వస్తే చూయించేందుకు యూడైస్ లో డేటా మార్పులు చేర్పులతో పాటు రికార్డులను కూడా తయారు చేసుకుంటున్నట్లు సమాచారం.ఉన్నతాధికారుల దృష్టికి బోగస్ వ్యవహారంవనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట మండలాల్లో టీజీ సెట్ ఎంట్రెన్స్ సమయంలో స్థానిక స్కూళ్ల పేరుతోనే కాకుండా హైద్రాబాద్ లో చదవకుండానే అక్కడి బోనఫైడ్ లు బోగస్ వి సిద్దం చేసుకుంటున్న విషయం రాష్ట్ర గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్, టీజీసెట్ ఎంట్రెన్స్ కన్వీనర్ మల్లయ్యభట్టు తదితర ఉన్నతాధికారులకు దృష్టికి చేరింది. దీంతో ఈ వ్యవహరం పై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని గురుకులాల కార్యదర్శి కార్యాలయం నుంచి ఆర్ సీఓ లకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారం వనపర్తి జిల్లా కు చెందింది కావడంతో గురుకులాల ఆర్ సీఓ వనజ సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ దృష్టి కి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన కలెక్టర్ ఈ ఇష్యూ విద్యాశాఖకు సంభందించిందని వనపర్తి డీఈఓ రవీందర్, పెబ్బేరు ఎంఈఓ జయరాములు కు విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సీందిగా ఆదేశించినట్లు ఆర్ సీఓ వనజ తెలిపారు.విచారణ సక్రమంగా జరిగేనా…?వనపర్తి జిల్లా విద్యాశాఖ ఇప్పటికే పూర్తిగా అవినీతి, అక్రమాలకు కేరాఫ్ మారిందన్న విషయం జిల్లా ప్రజలకు తెలుసు. వనపర్తి డీఈఓ గా రవీందర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడపే కాకుండా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు భారీగా వెల్లువెత్తాయి.ఈ అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) డి.వేణుగోపాల్ ను కలెక్టర్ ఆదేశించారు.ప్రస్తుతం బోగస్ బోనపైడ్ ల దందాకు సైతం డీఈఓ, ఎంఈఓ లు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఇదివరకు కోచింగ్ సెంటర్లపై వచ్చిన ఫిర్యాదులను వీరు తొక్కిపట్టి అక్రమార్కులకు సహకరిస్తున్నారన్నది బహిరంగ రహస్యం.ఇలాంటి సమయంలో బోగస్ బోనఫైడ్ ల విచారణ డీఈఓ, ఎంఈఓ లకు అప్పగించడాన్ని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. ఈ ఇష్యూపై విజిలెన్స్ అధికారులతో ప్రత్యేకంగా విచారణ చేయిస్తేనే ఇలాంటి అక్రమాలు శాశ్వతంగా రద్దు అవుతాయని వారు భావిస్తున్నారు. తప్పని సరిగా విజిలెన్స్ టీం తో ప్రత్యేకంగా విచారణ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ దృష్టికి తీసుకెళ్లగాఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.డమ్మీలుగా…ఎంఈఓ లు…వనపర్తి జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉండగా కేవలం ఒకే ఒక్కరు రెగ్యులర్ ఎంఈఓ గా ఉండడం మిగిలిన 13 మండలాలకు గెజిటెడ్ హెచ్ఎం లకు ఇంచార్జీ ఎంఈఓ బాధ్యతలు అప్పగించడంతో కొందరు ఎంఈఓలు డమ్మీలుగా మారిపోయారు. ప్రధానంగా వనపర్తి మండల ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ గోపాల్ పేట, రేవల్లీ మండలాలకు ఎంఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్నా ఏనాడూ గవర్నమెంట్ స్కూళ్ల మొఖం చూసిన పాపాన పోలేదు. పేరుకుమూడు మండలాల ఎంఈఓ అయినా ఏ ఎంఈఓ ఆఫీస్ లోనూ ఆయన కనిపించడన్న విమర్శలు ఉన్నాయి. వనపర్తి, గోపాల్ పేట, రేవల్లి మండలాల కు సంభందించిన సిబ్బంది , టీచర్లు వనపర్తి లోని ఆయన ఇంటి ముందు పడిగాపులు కాసి సంతకాలు పెట్టించుకోవాల్సీన దుస్థితి నెలకొంది. దీంతో వనపర్తి ఎంఐసీ కోఆర్డీ నేటర్ రేణుకుమార్ అన్ని తానై ఎంఈఓ లాగిన్ తో పాటు చేయాల్సీన కీలకమైన పనులను చక్కబెడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కొత్తకోట, మదనాపురం మండలాల ఎంఈఓ కృష్ణయ్య సైతం గవర్నమెంట్ స్కూళ్ల వైపు వెళ్లకుండా ప్రైవేట్ స్కూళ్లు, కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఇచ్చే కమీషన్లు తీసుకుంటూ ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వారికి సహకరిస్తున్నారు. కొత్తకోట మండల కేంద్రంలో అనుమతులు లేవని జీటీ నారాయణ కోచింగ్ సెంటర్ ను సీజ్ చేసినా పక్కనే గోడ ను కూలగొట్టి మళ్లీ కోచింగ్ నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు చేసినా యాజమాన్యంతో కుమ్మక్కై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడే కొనసాగించేందుకు సహకారం అందిస్తున్నాడు. ఈయన ఏకంగా డీఈఓ ఫోన్ చేసినా పట్టించుకోనంతా నిర్లక్ష్యంగా ఉన్నా ఎలాంటి చర్యలు లేవు.పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల ఎంఈఓ జయరాములు తన మండలంలో పుట్టగొడుగుల్లా అనుమతి లేని కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ స్కూళ్లు ఏర్పాటు చేసుకుంటున్నా పట్టించుకోరు.దీన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ అశోక్ ఎంఈఓ లాగిన్ తో పాటు అన్ని పనులు చక్కదిద్దుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు.ఏకంగా ఎంఈఓ లాగిన్ లో యూడైస్ డేటా ను టాంపరింగ్ చేసినా పట్టించుకునే స్థితిలో ఎంఈఓ జయరాములు ఉండడంతో కంప్యూటర్ ఆపరేటర్ అశోక్ మాత్రం దర్జాగా బోగస్ బోనఫైడ్ ల దందాను కొనసాగిస్తున్నాడు. పెబ్బేరు , శ్రీరంగాపూర్ లో విద్యాశాఖ తరపున ఎలాంటి ఎంక్వైరీ వచ్చినా ఏమీ కాదని అన్ని ఎంఈఓ సహకారంతో చక్కబెడుతున్నాడు. ఇలా మండలాల్లో ఎంఈఓ లు, జిల్లాలో డీఈఓ లు ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుడడంతో వనపర్తి జిల్లాలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.