- తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతా
- నేను ముమ్మాటికీ ఈ గడ్డ బిడ్డనే
- మా పార్టీ ఎవరి కిందా పనిచేయదు
- రాజన్న సంక్షేమ పాలనను మళ్లీ తీసుకొస్తాం
- స్వరాష్ట్ర ఫలాలు అన్నీ ప్రగతి భవన్ కే..
- ఉద్యమ ఆకాంక్షలు ఫలించలేదు
- ఆత్మగౌరవం దొర కాలికింద నలిగింది
- సచివాలయంలో అడుగుపెట్టని సీఎం అవసరమా?
- జూలై 8న పార్టీ జెండా, ఎజెండా ప్రకటిస్తాం
- ఖమ్మం ’సంకల్పసభ‘లో వైఎస్ షర్మిల
సారథి, ఖమ్మం: తెలంగాణ కోసం బరాబర్ నిలబడతానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెరిగానని, ఇక్కడే బిడ్డ, కొడుకును కన్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తానని, ప్రజల ఆకాంక్షల సాధన, ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని పునరుద్ఘాటించారు. అవకాశమిస్తే నమ్మకంగా సేవ చేస్తానని.. లేకపోతే వారి తరఫున పోరాటం చేస్తానన్నారు. శుక్రవారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో జరిగిన సంకల్పసభలో ఆమె ప్రసంగించారు. తెలంగాణ భౌగోళికంగా ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజాసమస్యలు తీరలేదన్నారు. ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో భజన చేసే కొందరికి మాత్రమే పదవులు దక్కుతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోయిందన్నారు. ప్రజాసమస్యలను వినే ఓపిక సీఎం కేసీఆర్ దొరకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలను పంపించే కంపెనీగా మారిందని దుయ్యబట్టారు. గెలిచిన వారం రోజుల్లోనే పసుపు బోర్డు తేస్తానన్న బీజేపీ తీరు తాటాకు అడిగితే ఈతకు ఇచ్చినట్టుందన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో 2004లో జంబో డీఎస్సీ ద్వారా 48వేల టీచర్ ఉద్యోగాలను భర్తీచేశారని గుర్తుచేశారు. 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని వివరించారు. ఆ ఇళ్లను చూసి అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలే అన్న కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించారో చెప్పాలని నిలదీశారు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఎంతో మంది యువతీ యువకులు చదువుకుని ఉద్యోగాలు సాధించారని, ఉపాధి పొందారని తెలిపారు. ఆరులక్షల ఎకరాల భూములు పంచారని వివరించారు. దళితులకు మూడెకరాల భూమి అన్న సీఎం కేసీఆర్ ఎకరా భూమినైనా పంచారా? అన్ని షర్మిల ప్రశ్నించారు. సింహం సింగిల్ గానే వస్తుందని.. మేం టీఆర్ఎస్ చెబితేనో, బీజేపీ అడిగితేనో.. కాంగ్రెస్ పురమాయిస్తేనో పార్టీ పెట్టడం లేదని వైఎస్ షర్మిల అన్నారు. మేం పెట్టబోయే పార్టీ ఎవరి కిందా పనిచేయదని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, సంక్షేమ కోసం పోరాడడానికి ప్రజాబాణమై వస్తున్నానని స్పష్టంచేశారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడం కోసం, ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడం కోసం తాను నిలబడతానని, ఎవరితోనైనా కొట్లాడడానికి సిద్ధమన్నారు.
ప్రశ్నించేందుకే మీ ముందుకొచ్చా..
తెలంగాణ ఆత్మగౌరవం దొర ఎడమకాలి చెప్పుకింద పడి నలిగిపోయిందని, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కేసీఆర్ కుటుంబానికే అన్నారు. స్వరాష్ట్ర ఫలాలు అన్నీ ప్రగతిభవన్ గేటు దాటి బయటకు రావడం లేదని షర్మిల ధ్వజమెత్తారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ బానిసైందని.. దొర దయ తలచి ఇస్తే తీసుకోవాలి.. లేకుంటే నోరు మూసుకోవాలనేలా తెలంగాణ నాయకుల పరిస్థితి ఉందని మండిపడ్డారు. దొర చెప్పిందే వేదం.. భాంచెన్ అన్నవాడికే రాజకీయ భవిష్యత్ ఉంటుందని.. అందరూ అలానే ఉంటే మరి ప్రశ్నించేవారు ఎవరన్నారు. అందేకే తెలంగాణలో మన పార్టీ అవసరం వచ్చిందన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాలనపగ్గాలు చేపడితే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని అందరిలాగే తానూ అనుకున్నానని కానీ అది నెరవేరలేదన్నారు. తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తానన్న కేసీఆర్ మాటలు నమ్మానని.. కానీ బంగారు తెలంగాణ సాధ్యమైందా..? అని ప్రశ్నించారు. అందుకే పాలకపక్షాన్ని ప్రశ్నించడానికే తెలంగాణలో పార్టీ అవసరం అన్నారు. సచివాలయంలో అడుగుపెట్టని సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే అని ఎద్దేవాచేశారు. అందుకే తాను అడుగుపెట్టని సచివాలయాన్ని కూల్చివేశారని విమర్శించారు.
జూలై 8న పార్టీ ఆవిష్కరణ
పార్టీ కార్యకర్తలే రేపటి నాయకులని, అధికార పార్టీకి భయపడకుండా పోరాటం చేయాలని.. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను తోడుంటానన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి జూల్ 8న కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు చెప్పారు. అదే రోజు జెండాను ఆవిష్కరించబోతున్నట్లు, అజెండా కూడా చెబుతానన్నారు. ఏప్రిల్ 9న ప్రత్యేకత ఉన్నందునే రాజన్న అడుగుజాడలో నడవడానికి తొలి అడుగు రాజకీయాల్లోకి వేస్తున్నట్లు చెప్పారు. అందుకే ఈ రోజే రాజన్న రాజ్యం తేవాలని సంకల్పిస్తు్న్నట్లు తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ ను మళ్లీ ప్రతిష్టించబోతున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ కు కేసీఆర్ కు పోలీకే లేదని, అభివృద్ధి, సంక్షేమం రాజన్నకు రెండు కళ్లన్నారు. ప్రజాదర్బార్ లో వైఎస్ వందల మంది కష్టాలు తీర్చాడని.. కానీ ప్రజాసమస్యలను వినే ఓపిక ఈ దొరకు ఉందా..? అని ప్రశ్నించారు. రూ.38వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన చేస్తే.. కేసీఆర్ దాని తలాతోక తీసేసి రీడిజైన్ పేరుతో రూ.లక్ష 30వేల కోట్లకు తీసుకెళ్లాడన్నారు.
15 నుంచి 3రోజులు నిరాహార దీక్ష
ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు లేక ప్రతిరోజూ ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఆత్మహత్యలు ఇంకా ఆగిపోవాలన్నారు. మరో చావు కబురు చెవిన పడకముందే కేసీఆర్ నిద్రలేచి నోటిఫికేషన్లు జారీచేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి ఏప్రిల్ 15వ తేదీనుంచి 3 రోజుల పాటు హైదరాబాద్లో నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. నాలుగో రోజునుంచి ప్రతి జిల్లాలో పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపడతారని పేర్కొన్నారు.
నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా: వైఎస్ విజయమ్మ
తెలంగాణకు వైఎస్ కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందని.. రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనా ఈ మనుషులతో తమకున్న అనుబంధంతోనే మీ ముందుకు వచ్చామని వైఎస్ విజయమ్మ అన్నారు. సంకల్పసభలో ఆమె మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా అభిమానించే మనిషి వైఎస్ రాజశేఖరరెడ్డి అని.. ఇచ్చిన మాటకు కట్టుబడే మనిషి అని, ఆయనకుండే కమిట్ మెంట్ తోనే షర్మిలమ్మ కూడా మీ ముందుకొస్తుందన్నారు. మేలు చేయడానికి తెలంగాణ గడ్డమీద కాలు మోపుతోందని.. తనను గుండెల నిండా ఆశీర్వదించాలని కోరారు. తాను ఎంచుకున్న దారి కఠినమైందని తెలిసినా.. ఆమె శరీరంలో ప్రవహించే రక్తం దేనికైనా ఎదురీదేదన్నారు. నా బిడ్డ షర్మిలను మీకు అప్పగిస్తున్నానని, ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు.