Breaking News

కందనూలు కల్లు దందాకు అడ్డుకట్ట పడేనా..?

#జిల్లా కేంద్రంలో రూ.20 కి పెరిగిన కల్లుసీసా ధర
#పక్క గ్రామాల్లో సీసా ధర రూ.10 కే అమ్మకాలు
#తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న కల్లు కొనుగోలుదారులపై దాడులు
#తమ వద్దే రూ.20 కి కొనుగోలు చేయాలంటూ కల్లు కాంట్రాక్టర్ దౌర్జన్యం
#కల్లు వ్యాపారి ఆగడాలను పట్టించుకోని పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలో కల్లు వ్యాపారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లా కేంద్రంలోని కల్లు వ్యాపారాన్ని దక్కించుకున్న కాంట్రాక్టర్ లీడర్ కావడంతో ఇప్పటి నుంచి నాగర్ కర్నూలు లో కల్లు నేనే అమ్మాలి. ఈ పాలనలో ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ అధికారుల అండదండలతో ప్రభుత్వం మారినా ఈయన ఆగడాలు తగ్గడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇతర మండలాలు, ఇతర గ్రామాలలో కల్లు సీసా ధర రూ.10 కే అమ్ముతున్నా ఈయన మాత్రం జిల్లా కేంద్రంలోనే కల్లు సీసా ధర రూ.20 కి పెంచేశాడు.

తనను అడిగేవారు ఎవరున్నారని…

తనకు నచ్చిన ధరకు కల్లు అమ్ముతాననట్లుగా ఇష్టం వచ్చినట్లు గల్లికో కల్లుదుకాణాన్ని తెరిచి అడ్డగోలు అక్రమ దందాకు తెరలేపాడు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో కల్లు ప్రియుల ను దృష్టి లో పెట్టుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వాడ వాడ కు ఓ కల్లు దుకాణాన్ని ఏర్పాటు చేయించడమే గాకుండా ఒక్కో సీసా కల్లు ధర ను రూ.20 కి పెంచేశాడు. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఎక్కడా కూడా ఈత వనాలు లేకున్నా, తగినన్ని ఈత చెట్లు లేకున్నా తన దుకాణాలకు మాత్రం కల్తీ కల్లును విచ్చలవిడిగా తయారు చేయించి సరఫరా చేస్తున్నా అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు.


కల్లు ప్రియులపై దౌర్జన్యం…

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉన్న దుకాణాలలో కల్లు సీసా ధర ఏకంగా రూ.20 కి పెంచడంతో కల్లుప్రియులు ధర పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం లో ఉన్న ఇతర గ్రామాలు, ఇతర మండలాల్లో కల్లు సీసా ధర కేవలం రూ.10 కి అమ్ముతుండడంతో కొందరు కల్లు ప్రియులు పక్క గ్రామాల నుంచి కల్లు తెచ్చుకుంటున్నారు. దీన్ని గమనించిన కల్లు వ్యాపారీ తక్కువ ధరకు తెచ్చుకుంటున్న కల్లును అడ్డుకొని దౌర్జన్యంగా పారబోయించడంతో పాటు వారిపై దాడులకు దిగుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు స్థానిక అధికారులకు , పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోకపోవడంతో కల్లు వ్యాపారి మరింత రెచ్చిపోతున్నాడు. ఇతర దుకాణాల నుంచి కల్లు తెచ్చుకోవడం కుదరదని, జిల్లా కేంద్రంలో అమ్ముతున్న ధరకే కల్లు తాగాలని కల్లు ప్రియులపై జులుం ప్రదర్శిస్తున్నాడు. ఎవరైనా తక్కువ ధరకు కల్లు తెచ్చుకున్న వారిపై భౌతిక దాడులకు దిగడమే కాకుండా తెచ్చుకున్న కల్లును పారబోయించి బెదిరింపులకు దిగుతున్నాడు. జిల్లా కేంద్రంలోనే ఇంత దౌర్జన్యం జరుగుతున్నా జిల్లా స్థాయి పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకొకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కల్లు కాంట్రాక్టర్ దౌర్జన్యాలను అదుపు చేయకుండా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు అతనికే సహకరించడం ఏంటనీ కల్లు ప్రియులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి కైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కల్లు కంట్రాక్టర్ ఆగడాలను అదుపులోకి తెచ్చి కల్లు ధర ను తగ్గించాలని వారు కోరుతున్నారు.