![ఏకగ్రీవ ఎమ్మెల్సీలు ఎవరంటే..](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/26HSB02.jpg?fit=655%2C331&ssl=1)
సామాజిక సారథి, హైదరాబాద్ప్రతినిధి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఐదు జిల్లాల్లో ఎన్నిక జరగనుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఆరు స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. వారికి ఎన్నికలఅధికారులు ధ్రువీకరణపత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి, నల్లగొండ ఒకటి, మెదక్ ఒకటి, ఖమ్మం ఒకటి, కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్ నుంచి దండె విఠల్, నల్లగొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఖమ్మం నుంచి తాతా మధు, మెదక్ నుంచి డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, కరీంనగర్ నుంచి భానుప్రసాద్ రావు, ఎల్.రమణ ఎన్నికల బరిలో నిలిచారు.