*సిబ్బంది ఫోన్లు స్వాదీనం చేసుకున్న టెమ్రీస్ అధికారులు టీచింగ్,
*నాన్ టీచింగ్ సిబ్బంది ఫోన్ల తనిఖీస్కూళ్లో స్టూడెంట్లు కొట్టుకున్న విషయాన్ని పక్కన పెట్టిన అధికారులుమీడియాకు సమాచారం ఎవరు ఇచ్చారని సిబ్బందిపై చిందులుసిబ్బంది కాల్ లీస్ట్,
*వాట్సాప్ చాటింగ్,
*వాట్సాప్ కాల్ లీస్ట్ పరిశీలనఅధికారుల తీరుపై మండి పడుతున్న సిబ్బంది
సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: ఏదైనా స్కూల్ లేదా కాలేజీలో పొరపాట్లు జరిగితే ఏం చేస్తాం… ఇంకో సారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంకోసారి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి ఒక్కరు బాధ్యతతో డ్యూటీలు చేయాలని నిర్ణయం తీసుకుంటాం…కాని వనపర్తి జిల్లా మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో మాత్రం ఇందుకు విరుద్దంగా కొత్త ఎంక్వైరీ షురూ చేస్తున్నారు. అదేంటంటే మైనార్టీ విద్యా సంస్థల్లో ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, టీచర్ల నిర్లక్ష్యాన్ని గాని, పర్యవేక్షణ చేయాల్సిన అధికారుల అలసత్వం పై వార్తలు రాస్తే టెమ్రీస్ అధికారులు సిబ్బందిపై చిందులు తొక్కుతున్నారు. అక్కడ జరిగిన తప్పులకు, పొరపాట్లకు బాధ్యులైన ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, టీచర్లను వదిలేసి స్కూళ్లు… కాలేజీల్లో జరిగిన తప్పులు మీడియాకు ఎవరు లీక్ చేశారు…ఎలా లీక్ చేశారని టెమ్రీస్ ఉన్నతాధికారులు సీబీఐ లెవల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదే సంఘటన వనపర్తి జిల్లా మైనార్టీ బాలుర గురుకుల పాఠాలలో గురువారం చోటు చేసుకుంది. వనపర్తి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో ఈ నెల 2న తొమ్మిదో తరగతి స్టూడెంట్లు రెండు గ్రూపులుగా ఏర్పడి గొడవపడి కొట్టుకున్నారు.ఈ గొడవలో సోహైల్ అనే స్టూడెంట్ ను యాదగిరి అనే స్టూడెంట్ క్రికెట్ బ్యాట్ తో చితకబాదడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు స్థానికంగా ఉండే టెమ్రీస్ ఆర్ఎల్ సీ తో ఇతర సిబ్బంది బయటికి పొక్కనియ్యకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాని ఈ విషయం ఆ నోటా ఈ నోటా మీడియా దృష్టికి వచ్చింది. ఇదే విషయాన్ని సామాజిక సారథి లో బుధవారం గురుకులం లో గ్యాంగ్ వార్ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఎంత గోప్యంగా ఉంచినా మీడియాకు విషయం లీక్ కావడాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు టెమ్రీస్ అధికారులు జీర్ణించుకోలేకపోయారు. టెమ్రీస్ హెడ్ ఆఫీస్ కు సైతం తెలియడంతో గురువారం హుటాహుటిన వనపర్తి మైనార్టీ బాయ్స్ స్కూల్ లో అకాడమిక్ కోఆర్డీనేటర్ సలీం, విజిలెన్స్ ఆఫీసర్ జమీర్ ఖాన్, ప్రిన్సిపాల్ ఆనంద్ బాబు తో పాటు మరికొంత మంది టెమ్రీస్ అధికారులు సమావేశమై ఎంక్వైరీ షురూ చేశారు.మీడియాకు సమాచారం లీక్ చేసిందెవరు…?గురువారం వనపర్తి కి వచ్చిన టెమ్రీస్ అధికారులు స్కూల్లో తొమ్మిదో తరగతి స్టూడెంట్లు కొట్టుకున్న విషయంలో ప్రిన్సిపాల్, టీచర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న వారిని వెనకేసుకువచ్చారు. అసలు స్కూళ్లో స్టూడెంట్లు గ్రూపులుగా ఎలా విడిపోయారు…? ఎందుకు గ్రూప్ లు అయ్యారు…? స్టూడెంట్ల మధ్య ఉన్న తగాదాలు ఏంటీ..? 24 గంటలు సిబ్బంది పర్యవేక్షణ ఉండగా, సీసీ కెమెరాల నిఘా ఉండగా ఈ సంఘటన ఎలా జరిగింది…? గొడవ జరిగిన రోజు డ్యూటీలో ఉన్నసిబ్బంది నిర్లక్ష్యం ఏంటీ…? ఇలా అనేక విషయాలకు గాలికొదిలేశారు. స్కూళ్లో జరిగిన గొడవ మీడీయాకు ఎవరు లీక్ చేశారు అనే దానిపై ఫోకస్ చేయడం అందరిని గందరగోళానికి పడేసింది. గురువారం పాఠశాలలో అసెంబ్లీ కాగానే స్కూల్ లోని టీచింగ్ , నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు సెలవుల్లో అక్కడ ప్రత్యేక డ్యూటీ చేస్తున్న మైనార్టీ బాలుర జూనియర్ కాలేజీ స్టాప్ కి చెందిన అందరి సెల్ ఫోన్లను టెమ్రీస్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. సిబ్బంది ఫోన్లను ఒక్కొక్కరిని ఆఫీస్ రూం కి పిలిపించి వారిచేతే ఫోన్ల లాక్ తీయించి వారి సెల్ ఫోన్ కాల్ లీస్ట్, వాట్సాఫ్ చాటింగ్, వాట్సాప్ కాల్ లీస్ట్ లను తనిఖీ చేశారు. ఇక్కడ జరుగుతున్న విషయాలను మీడియాకు చెబుతున్న వారు స్వచ్చందంగా ఒప్పుకోవాలంటూ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ ను బెదిరింపులకు దిగారు. టెమ్రీస్ అధికారులు ఇలా తమ ఫోన్లను స్వాదీనం చేసుకొని వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించడం ఏంటనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యవేక్షణ చేయాల్సీన అధికారులు పట్టించుకోకుండా స్కూళ్లను, జూనియర్ కాలేజీలను గాలికొదిలేసి ఇప్పుడు సిబ్బంది ఇబ్బందులు పెట్టడం తగదని అన్నారు. ఈ విషయంపై మాట్లాడినా, ప్రశ్నించినా తమను ఉద్యోగాలనుంచి తొలగిస్తారన్న భయంతో సిబ్బంది వణికిపోతున్నారు. టెమ్రీస్ సొసైటీ నుంచి స్కూళ్లు, కాలేజీల నిర్వహణకు అనేక నిభందనలు, గైడ్ లైన్స్ ఇస్తున్నా క్షేత్రస్థాయిలో వాటిని ప్రిన్సిపాళ్లు పట్టించుకోకపోవడం, పర్యవేక్షణ చేయాల్సీన అధికారులు సైతం ఎప్పుడో ఓ సారి చుట్టపు చూపుగా వచ్చిపోవడంతో క్షేత్రస్థాయిలో మైనార్టీ విద్యాసంస్థలు అస్తవ్యస్థంగా తయారవుతున్నాయి. తప్పులను సరిదిద్దాల్సీన టెమ్రీస్ అధికారులు సైతం ఇలా ప్రిన్సిపాళ్లను, బాధ్యులైన సిబ్బందిని వెనకేసుకువస్తూ మిగిలిన సిబ్బంది ఇబ్బంది పెట్టడాన్ని విద్యావేత్తలు ఖండిస్తున్నారు ఫోటోరైటప్: వనపర్తి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల