- మన్ననూర్ గురుకుల ప్రిన్సిపల్, టీచర్ ను శిక్షించాలి
- 25న అఖిలపక్ష బందును విజయవంతం చేయండి
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జట్టి ధర్మరాజు
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఈనెల6న అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిఖిత అనే ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని అదే పాఠశాలలో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటన అందరికీ తెలిసిందే. చనిపోయిన నిఖిత దళితరాలు కావున పాఠశాల యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకించి వారి కుటుంబానికి మృతదేహాన్ని అప్ప చెప్పడం బాధాకరమైన విషయమని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జట్టి ధర్మరాజు, ఎంఎస్ పీ జిల్లా కన్వీనర్ గూట విజయ్ ఖండించారు. శనివారం నాగర్ కర్నూల్ లోని సింగిల్ విండో కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నిఖిత మృతిపై అఖిలపక్ష ఆధ్వర్యంలో అచ్చంపేట ప్రాంతంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తే అక్కడి పోలీసు అధికారులు స్పందించి రీపోస్టుమార్టం చేశారని, అప్పుడే నిఖితది హత్యగా తెలిసిపోయిందని వారు అన్నారు. ఈ పోరాటమంతా ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ బాధిత కుటుంబాలను పరామర్శించారని అన్నారు. జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించి హత్యచేశారని నిర్ధారణ చేసిన తర్వాతే అధికార యంత్రాంగం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నానాతంటాలు పడుతున్నదని అన్నారు.
25న జిల్లా కేంద్రంలో బంద్
నిఖిత హత్యపై జరిగిన కుట్రలు బహిర్గతం చేసి నిందితులకు శిక్ష పడేందుకు ఈనెల 25వ తేదీన జిల్లా కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునివ్వడం చేశామని, అందరూ సహకరించి నిఖిత కుటుంబానికి న్యాయం కొరకు పోరాడాలని వారు పిలుపునిచ్చారు. అఖిలపక్ష ఆధ్వర్యంలో చేపట్టే బందును విజయవంతం చేయాలని నిఖిత కుటుంబానికి భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎం ఎస్ పీ నాయకులు కరిగెల దశరథం, నల్లగంటి నాగన్న, ఉమ్మడి జిల్లా ఎంఎస్పీ ఇంచార్జ్ టైగర్ జంగయ్య, బాబు జగ్జీవన్ రావ్ విగ్రహ కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి వెంకటయ్య , కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు భాస్కర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొడిదల రాము, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. శ్రీను, బీసీ సంక్షేమ నాయకులు కోళ్ల నిరంజన్ , బీఎస్పీ జిల్లా నాయకుడు బండి పృథ్విరాజ్, బీజేపీ జిల్లా నాయకులు ప్రమోద్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు మోహన్ , ఎంఎస్పీ మండల నాయకులు తిమ్మ గళ్ల కురుమయ్య, చిన్నగాల లక్ష్మణ్, మిద్దె నరసింహ ఉన్నారు.