-నాగర్ కర్నూల్ లో రెండు పార్టీల నుంచి మాదిగ అభ్యర్థులు పోటీ చేస్తున్న ఒక పార్టీకి మద్దతు ప్రకటన
– ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న బిజెపికి కాకుండా బి ఆర్ ఎస్ కు మద్దతు పలకడంలో చక్రం తిప్పింది ఎవరు
– కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మల్లు రవికి తూట్లు పడుతున్న మాదిగ నేతలు
సామాజిక సారధి, నాగర్ కర్నూల్ బ్యూరో… పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ రాజకీయ నాయకులు ఇతర సంఘాల నాయకులు ఉత్తేజం అవుతున్నారు. ఇందులో భాగంగా నాగర్కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అన్ని పార్టీల నేతలు బిజినాపల్లిలోని మంగి విజయ్ ఇంట్లో సమావేశమై మండలాలలో మాదిగ ఐక్యవేదికను ఏర్పాటు చేయాలని మాదిగల ఐక్యత వర్ధిల్లాలని సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి అన్ని పార్టీలలో ఉన్న మాదిగ నేతలు హాజరై ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గం నుంచి పోటీ చేసే నేతలకే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అయితే నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రెండు ప్రముఖ పార్టీలు బిజెపి మరియు బీఆర్ఎస్ లో మాదిగ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించాయి. కానీ ఐక్యవేదిక నేతలు మాత్రం బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతు పలకాలని నిర్ణయించుకోవడంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సమావేశంలో దాదాపు ఎక్కువమంది నేతలు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉన్నప్పటికీ ఇతర పార్టీల నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్న నాయకులు కూడా ఉండడంతో ఆ సమావేశం చర్చనీ అంశంగా మారింది. తెలకపల్లి నుంచి ఇద్దరు టిఆర్ఎస్ నాయకులు, తాడూరు మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బిఎస్పి పార్టీ నుంచి నాగర్ కర్నూల్ అసెంబ్లీ అభ్యర్థి కూడా ఉండడం అందరూ కలిసి ఒకరికి మద్దతు ఇవ్వాలని తీర్మానించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎమ్మార్పీఎస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా బిజెపికి వేషరతుగా మద్దతు ఇస్తున్నారు . ఎస్సీ వర్గీకరణకు బిజెపి పార్టీ అనుకూలమని చెప్పడంతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కూడా అందరిని బిజెపి పార్టీకి పార్టీలకు అతీతంగా ఓట్లు వేయాలని సూచించారు. కానీ బిజినపల్లి మండలంలోని ఓ కీలక నేత గతం లో కూడా బిజెపికి అనుకూలంగా ఓట్లు వేయిస్తామని మందకృష్ణ మాదిగ వద్ద చెప్పి ప్రస్తుతం బి ఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకాలని నిర్ణయించుకోవడం వెనక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మార్పీఎస్ పేరు చెప్పుకొని నేతలుగా ఎదిగిన వారు ప్రస్తుతం ఆ సంఘాన్ని వ్యతిరేకించడం ఏమిటని దాంట్లోని సభ్యులే చెవులు కోరుకుంటున్నారు.
ఎస్సీ వర్గీకరణను కాదని..
దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా హైదరాబాదులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమని చెప్పి పెద్ద ఎత్తున మాదిగ నేతలతో భారీ బహిరంగ సభను నిర్వహించారు . ఆ తర్వాత కమిటీ కూడా ఏర్పాటు చేయడంతో ఎస్సీ వర్గీకరణ జరిగిపోతుందని అందరూ ఆశల్లో ఉన్నారు. కానీ ప్రస్తుతం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో పోరాటాలు సాగిస్తున్న నాయకులు బిజెపి నుంచి పోటీ చేస్తున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాదను కాదని , ఎస్సీ వర్గీకరణ గురించి ఏమాత్రం పోరాటాలు చేయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతు తెలపాలని నిర్ణయించుకోవడంలో చక్రం తిప్పుతున్నది ఎవరని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు.
మల్లు రవి కి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ నాయకులు..
సోమవారం బిజినాపల్లి మండల కేంద్రంలో జరిగిన మాదిగ ఐక్యవేదిక సమావేశానికి తాడూరు మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కూడా హాజరై వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలపడం మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి మల్లు రవికి ఇబ్బందికరంగా మారింది. మల్లు రవికి చెందిన చాలామంది శిష్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతు పలకడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.