- బిజినేపల్లి మండలంలో జోరుగా పేకాట
- మహబూబ్‌నగర్‌కు మారిన మకాం
- తాజాగా పట్టుబడిన కొందరు అధికారపార్టీ నేతలు
- నిందితుల నుంచి రూ.8.92లక్షలు స్వాధీనం
- స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్‌జిల్లా బిజినేపల్లి మండలం కొంతమంది పలుకుబడి కలిగిన నేతలు, రియల్టర్లు, డ్రగ్స్, ఇసుక వ్యాపారులకు పేకాట అడ్డాగా మారింది. సామాన్యులపై ప్రతాపం చూపించే నాయకులు వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాకు కొంతమంది అధికారపార్టీకి చెందిన 11 మంది నేతలు నాలుగురోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో పేకాట ఆడుతూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు దొరికిపోయారు. వారిని నుంచి రూ.8.92 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో బిజినేపల్లి మండలానికి చెందిన పలువురు అధికారపార్టీ నాయకులు ఉన్నారు. పైగా వారిలో ఇద్దరు మండలంలో కీలక పదవులు అనుభవిస్తున్న నేతలు ఉండటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మూడు రోజుల క్రితం దాడులు జరిగినప్పటికీ అధికారపార్టీ నాయకులు తమ ‘పవర్’ను ఉపయోగించి అసలు విషయాన్ని బయటికి రాకుండా చేశారు.
చాలా రోజులుగా బిజినేపల్లి మండల కేంద్రంగా పలుచోట్ల పేకాట స్థావరాలుగా కొనసాగుతున్నా.. పోలీసులకు సమాచారం ఉన్నా.. అధికార పార్టీ నాయకులు అందులో కీలకపాత్ర వహించడంతో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. తాజాగా పొరుగు జిల్లాలో కేసు నమోదుకావడంతో స్థానిక పోలీసులు ఉలికిపాటుకు గురవుతున్నారు.
- రియల్‌భూమ్.. డబ్బే డబ్బు!
సాధారణంగా నాగర్‌కర్నూల్‌జిల్లాలో బిజినేపల్లి మండల కేంద్రంగా రియల్‌ఎస్టేట్‌వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇసుక, మట్టి, డ్రగ్స్, సీడ్స్వ్యాపారం కాసులు కురిపిస్తోంది. లక్షలాది రూపాయల అక్రమ సంపాదన వచ్చేస్తుండటంతో కొందరు నాయకులు పేకాట, ఇతర జల్సాలకు తెరతీశారు. మండలంలోని నందివడ్డెమాన్, గంగారం, మంగనూర్, వట్టెం, బిజినేపల్లి తదితర గ్రామాల్లో కీలకమైన పేకాట స్థావరాలు ఉన్నాయని పోలీసుల రికార్డుల్లో ఉంది. ఇక్కడికి హైదరాబాద్, కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్, జడ్చర్ల తదితర ప్రాంతాల నుంచి వచ్చి పేకాట ఆడుతూ ఎంజాయ్చేస్తుంటారు. ఒక్కసారి ఒక్క స్థావరంలోనే లక్షలాది రూపాయలు చేతులు మారుతుంటాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఇక్కడ పేకాట ఆడుతూ అధికారపార్టీకి చెందిన ఓ ముఖ్యనేత సోదరుడు కూడా పట్టుబడ్డాడు. డబ్బులు పోగొట్టుకుంటున్న కొందరు ఆస్తిపాస్తులను అమ్ముకొని రోడ్డునపడ్డవారూ ఉన్నారు. అయితే జిల్లా పోలీసులు పేకాటను అరికట్టే క్రమంలో గట్టిచర్యలు తీసుకోవడంతో కొంత తగ్గింది. కానీ ఇటీవల పేకాటరాయుళ్లు తమ స్థావరాన్ని మహబూబ్‌నగర్‌కు మార్చారు. స్థానిక పోలీసులు అధికారపార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి కొంత చూసీచూడనట్లుగా వ్యవహరించినా మహబూబ్‌నగర్‌జిల్లా పోలీసులు మాత్రం వదిలిపెట్టలేదు. పేకాట ఆడుతున్న 11 మంది నేతలను పక్కాప్లాన్‌తో లాడ్జిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిలో ముఖ్య పదవుల్లో ఉన్న అధికారపార్టీ నాయకులు కొందరు ఉన్నారు. ఈ విషయం మూడు రోజుల దాకా బయటికి పొక్కలేదు. జూదం ఆడొద్దని నీతులు చెప్పే నేతలు చాటుమాటున మూడు ముక్కలాట కానిచ్చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నూతన ఎస్పీగా మనోహర్బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జిల్లాలోని పేకాటస్థావరాలపై ఉక్కుపాదం మోపాలని, నిందితులు ఎవరైనాసరే కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.