Breaking News

బ్యాంకుల్లో ఖాళీలను భర్తీచేస్తాం

బ్యాంకుల్లో ఖాళీలను భర్తీచేస్తాం
  • ఖాళీలు 41,177 పోస్టులు మాత్రమే
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: డిసెంబర్‌ 1 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 41,177 స్థానాలు లేదా మొత్తం మంజూరైన పోస్టుల్లో ఐదుశాతం ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోయిన విషయం ప్రభుత్వానికి తెలుసా..? అని లోక్‌సభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. డిసెంబర్‌ 1వ తేదీ నాటికి బ్యాంకులకు కేటాయించిన పోస్టుల్లో 95శాతం భర్తీ అయ్యాయని ఆమె వెల్లడించారు. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులకు కేటాయించిన 8,05,986 ఉద్యోగాల్లో కేవలం 41,177 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్‌, క్లర్క్‌, సబ్‌స్టాఫ్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎస్‌బీఐలో 8,544, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 6,743, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 6,295, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో 5,112, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 4,848 ఉన్నట్లు  మంత్రి వెల్లడించారు. ఆరేళ్లలో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లో ఒక్క పోస్టు తగ్గించామన్నారు. మిగిలిన బ్యాంకుల పోస్టుల్లో ఎలాంటి కోత విధించలేదని వివరించారు. బ్యాంకులు వారి అవసరాలకు అనుగుణంగా ఖాళీలను భర్తీ చేయడానికి సిబ్బంది నియామకాన్ని చేపడతాయని ఆమె తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభానికి ముందు, 2001లో పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో మరణించిన తొమ్మిది మంది, జవాన్​కు లోక్‌సభ నివాళులర్పించింది. మృతులకు నివాళులర్పిస్తూ సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.